తెలంగాణాలో తెదేపా, వైకాపాలను దాదాపు తుడిచిపెట్టేసిన తెరాస ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాసలో చేరి ఉన్నారు. మిగిలిన వారిని కూడా తెరాసలోకి ఆకర్షించగలిగితే ఇక తెలంగాణాలో తెరాసకు ఎదురు ఉండదు.
నల్గొండ జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర రావు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలను తెరాసలోకి రప్పించేందుకు మంత్రి హరీష్ రావు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లున్నాయి. ఇంతవరకు తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా తీవ్రంగా పోరాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి పార్టీ మారడం గురించి చర్చలు జరిపారు. నల్గొండలో నిన్న మీడియా ప్రతినిధులు ఆయనని ఇదే విషయం అడిగినప్పుడు “రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు” అని చెప్పడం గమనిస్తే ఆయన పార్టీ మారడం ఖాయం అని అర్ధమవుతోంది.
ఎమ్మెల్యే భాస్కరరావు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే చాలాసార్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు ఆయన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి వచ్చారు. కనుక ఆయన కూడా పార్టీ మారడం ఖాయమేనని చెప్పవచ్చు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారడం గురించి మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే “నేను పార్టీ మారడం లేదు,” అని చెప్పారు. అంటే వెంకటరెడ్డి పార్టీ మారుతున్నారని చెప్పినట్లే భావించవచ్చు.
అదే జిల్లాకు చెందిన కె. జానారెడ్డి కూడా తెరాసలో చేరే ఉద్దేశ్యంతోనే తెరాస ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. జానారెడ్డి పార్టీ మారేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చు కానీ మిగిలిన ముగ్గురూ నేడోరేపో తెరాస కారు ఎక్కేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడితే నల్గొండ జిల్లాలో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం అసాధ్యం.
తెలంగాణాలో కాంగ్రెస్ అడ్డు కూడా తొలగించుకోగలిగితే, ఇక మిగిలింది భాజపా, వామపక్షాలు. ఆ రెండూ తెరాసను సవాలు చేయగలిగే పరిస్థితిలో లేవు. భవిష్యత్ లో కూడా ఎదిరించలేకపోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో భాజపాని బలపరుచుకొని, తెరాసకు ప్రత్యామ్నాయంగా మలిచి అధికారంలోకి వస్తామని రాష్ట్ర భాజపా నేతలు చెప్పుకొంటున్నారు.
అందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కానీ తెరాస ధాటిని తట్టుకొంటూ రాష్ట్ర ప్రజలను దాని ప్రభావం నుండి బయటకు తీసుకువచ్చి భాజపావైపు ఆకర్షించడం చాలా కష్టం. కనుక భాజపా ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు.
ఇక తెలంగాణాలో తెదేపా తరపున ఒక్క రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ పని చేస్తున్నట్లు కనబడరు. ఆయన మహానాడులో మిషన్-99 అంటూ గొప్ప కోసం ఏదో ప్రకటించినప్పటికీ, ఆయన ఒక్కరి వల్ల పార్టీకి పునర్వైభవం సాధించడం సాధ్యం కాదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికలలో తెరాసకి ఏ పార్టీ నుంచి గట్టి పోటీయే ఉండకపోవచ్చును.