నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరడానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లైన్ క్లియర్ చేసినట్లు తాజా సమాచారం. అయితే ఆయన తన ఎంపి పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరుకొంటున్నారు. ఆ విధంగా చేయకుండానే పార్టీలో చేరవచ్చని కెసిఆర్ చెప్పినప్పటికీ, పార్టీ విడిచిపెట్టేటప్పుడు ఆ పార్టీ ద్వారా గెలుచుకొన్న ఎంపి పదవిని అట్టేబెట్టుకోవడం అనైతికమని గుత్తా భావిస్తున్నారు. కనుక ఆయన రాజీనామా చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయన రాజీనామా చేస్తారో లేదో ఇంకా తెలియదు కానీ పార్టీ మారడం మాత్రం ఖాయమనే చెప్పవచ్చు. కెసిఆర్ ఆయనకి మంత్రి పదవి కానీ ఒకవేళ అది సాధ్యం కాకపోతే క్యాబినెట్ హోదా గల ప్రభుత్వ సలహాదారు పదవిగానీ ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రి పదవి గురించి కెసిఆర్ ఆలోచించుకొనేలోగా, తన ఎంపి పదవికి రాజీనామా గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లయితే, తెరాస అనవసరంగా ఒక ఎంపి సీటు వదులుకొన్నట్లవుతుంది. కానీ అది మంచి సంప్రదాయం కనుక గుత్తా నిర్ణయాన్ని ఆహ్వానించవలసిందే.
నల్గొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారిపై ఆయన సోనియా గాంధీకి పిర్యాదు చేస్తూ ఒక లేఖ కూడా వ్రాశారు. తనకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి ఉండి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నట్లు లేఖలో వ్రాసినట్లు తెలుస్తోంది. అంటే ఆయన అసంతృప్తి కారణం అదేనని అర్ధం అవుతోంది. కానీ పార్టీలో ఎవరితో కలవలేని ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడితే పార్టీలో అసమ్మతి మొదలవుతుంది కనుక ఆయనకి ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. మరికొన్ని రోజులు వేచి చూసి ఆయన కూడా తెరాసలో చేరిపోయినా ఆశ్చర్యం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వంటి స్వేచ్చా స్వాతంత్ర్యాలున్న పార్టీలోనే ఇమడలేని కోమటిరెడ్డి, కెసిఆర్ కనుసన్నలలో నడుస్తున్న తెరాసలో చేరితే సర్దుకు పోవడం చాలా కష్టం కావచ్చు. ఒకవేళ వారిద్దరూ కాంగ్రెస్ పార్టీని వీడినట్లయితే, జిల్లాలో మళ్ళీ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. పైగా పార్టీకి లోక్ సభలో ఒక ఎంపి కూడా తగ్గినట్లవుతుంది.