బీఆర్ఎస్ నేతలు ఆనకట్టలు కట్టినా ఆ పార్టీలో ఉండేందుకు సిద్ధంగా లేరు. ఓ వైపు ఎన్నికల సన్నాహాకంగా కరీంనగర్లో సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ సభ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకుండా పార్టీలు మారే పనిలో పడ్డారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ గైర్హాజరయ్యారు. మంగళవారం ఉదయం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.
కాంగ్రెస్ టికెట్ కోసమే అమిత్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ మొదలైంది. నల్లగొండ టికెట్ ను ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డికి ప్రకటిచింది. భువనగిరి స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది.గుత్తా అమిత్ కు నల్లగొండ లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్న స్థానిక రాజకీయాల కారణంగా ఆయన తన కుమారుడ్ని కాంగ్రెస్లోకి పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తా వర్గయులకు సరిపడటం లేదు. టిక్కెట్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వర్గం సహకరించదన్న కారణంగా వారు బయటకు రావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీలో చేరాలనుకుంటున్నారు. కొంత మంది కాంగ్రెస్.. మరికొంత మంది బీజేపీ వైపు చూస్తున్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సీనియర్ నేత జలగం వెంకట్రావు.. బీజేపీలో చేరిపోయారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కొత్తగూడెం నియోజకవర్గం నుండి స్వాతంత్ర పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 52వేలకు పైగా ఓట్లు సాధించారు.