ఫిరాయింపు నేతల పరిస్థితి ఒక్కోసారి ఇలా కూడా మారిపోతుందని చెప్పడానికి ఆ సీనియర్ నేత పేరును ఉదహరించొచ్చు! కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లారు. పోనీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్లినా కొంత బాగుండేది. తెరాసలో చేరితే మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన తరువాతే గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు అంటారు. పార్టీ మారిన తరువాత పరిస్థితి ఏమైందీ..? గుత్తాకు మంత్రి పదవి ఇవ్వాలనే ఊసెత్తే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఆయన కూడా తెరాసను ప్రశ్నించే పరిస్థితి అంతకన్నా లేదు. అలాగని, తెరాసలోకి వచ్చి ఏం సాధించారంటే.. చెప్పుకోవడానికి ఏమీ లేదు. గుత్తా అనుచరులు కొందరు ఇదే అంశాన్ని తాజాగా ఆయన దగ్గర ప్రస్థావనకు తీసుకొచ్చినట్టు సమాచారం. అధికార పార్టీలోకి వచ్చిన తరువాత ప్రత్యేకంగా ఏం సాధించలేకపోయామనే నిర్వేదం ఆ వర్గంలో కాస్త ఎక్కువౌతోందని తెలుస్తోంది.
నిజానికి, తనకు మంత్రి పదవి రాకపోయినా గుత్తా పెద్దగా అసంతృప్తికి గురైనట్టు కనిపించలేదు. లోలోప ఉందేమోగానీ, ఇన్నాళ్లూ బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. తెరాసను బాగానే ఓన్ చేసుకుని, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ మధ్య నల్గొండ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగొచ్చే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అంతేకాదు, రాష్ట్రంలో కొత్తగా వేసిన రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర బాధ్యతలు ఆయనకి అప్పగిస్తారనీ, దీనికి క్యాబినెట్ హోదా కల్పిస్తారని కూడా అన్నారు. రేపోమాపో గుత్తా బాధ్యతల స్వీకరణ ఉంటుందని ఆయన అనుచర గణం కూడా ఆసక్తిగానే ఎదురుచూసింది. ఎలాగూ మంత్రి పదవి రాలేదు, కనీసం క్యాబినెట్ హోదా ఉన్న ఆ పదవి దక్కినా సంతోషం అనుకుంటే… ఆ తరువాత, దీనిపై కేసీఆర్ సాబ్ స్పందించడం మానేశారు! ఇంతకీ ఈ పదవి ఉంటుందో లేదో అనే స్పష్టత కూడా తెరాస అధినాయత్వం నుంచి రాలేదు. దీంతో గడచిన కొన్ని వారాలుగా గుత్తా అసంతృప్తిగానే ఉన్నట్టు చెబుతున్నారు. తన అనుచరులతో ఇదే విషయమై ఈ మధ్య చర్చిస్తున్నారట!
తెలంగాణలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుత్తా అసంతృప్తి వార్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉండటం విశేషం. అంటే, గుత్తా సొంత గూటికి వెళ్లిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. గుత్తా వైపు నుంచి ఇలాంటి సంకేతాలేవీ లేవుగానీ, ప్రస్తుతం ఆయన మద్దతుదారుల్లో మొదలైన తెరాస తీరుపై అసంతృప్తి అనేది మరింత పెరిగితే… అప్పుడు పార్టీ మార్పు చర్చ ఉంటుంది. కానీ, ఆ దశకు ఇంకాస్త సమయం ఉందనే చెప్పాలి. ఏదేమైనా, మంత్రి పదవికోసం తెరాసలోకి వస్తే.. అది దక్కలేదు. కనీసం క్యాబినెట్ ర్యాంకింగ్ ఉన్న పదవి ఇస్తారని అనుకుంటే అదీ అనుమానంగానే ఉంది. గుత్తా అసంతృప్తికి కావాల్సినంత బేస్ ఉంది! మరి, దీన్ని కేసీఆర్ అర్థం చేసుకుంటారా..? లేదా, కేసీఆర్ అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఆయన అసంతృప్తిగా ఉన్నారనే కథనాలకు ఆస్కారం ఇచ్చేలా గుత్తానే లీకులు ఇస్తున్నారా..?