అవకాశవాద రాజకీయాలు చేయని నాయకులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి..? ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచి.. రాజీనామా చేయకుండా అధికార పార్టీ పంచన చేరడం అవకాశవాద రాజకీయం కాదా? మంత్రి పదవులు పొందడం, క్యాబినెట్ ర్యాంకింగ్ హోదా అనుభవించడం అవకాశవాదం కాదా? ఇలాంటి అంశాల గురించి ఫిరాయింపు నేతలు మాట్లాడితే ఎలా ఉంటుంది! అవకాశవాద రాజకీయాలూ సొంత ప్రయోజనాల కోసమే రాజకీయాలు అంటూ జంప్ జిలానీ నేతలు నీతులు వల్లె వేస్తుంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది..! సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు ఇలానే మాట్లాడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉంటూ వచ్చిన గుత్తా, ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
ఛలో అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని టి. కాంగ్రెస్ చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేశారు గుత్తా. ఛలో అసెంబ్లీ పేరుతో ఒక కొత్త డ్రామాకు కోమటిరెడ్డి తెర తీశారంటూ ఎద్దేవా చేశారు. గడచిన వారం రోజుల వరకూ ఆయన తెరాసలో చేరేందుకే ప్రయత్నాలు చేశారనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళ్లావేళ్లా పడి బతిమాలుకున్నారంటూ ఆరోపించారు. తెరాసలో వచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఆయన కోతి చేష్ఠలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్న కారణంతోనే కేసీఆర్ వద్దు అన్నారని చెప్పారు. తెరాసలో చేర్చుకోకపోయేసరికి ఆయనకి ప్రజా సమస్యలు గుర్తొచ్చేశాయనీ, ఇలా అవకాశవాద రాజకీయాలు చేసేవారిని రైతులు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిని ప్రజలు నమ్మొద్దనీ, సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసేవారిని దూరం పెట్టాలని ఆయన చెప్పారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడైన తరువాత తెరాసలోకి వెళ్లడం అవకాశవాద రాజకీయమా కాదా..? తెరాసలో చేరేందుకు కోమటిరెడ్డి చేసిన ప్రయత్నాలను ఇప్పుడు గుత్తా తప్పుబడుతూ ఉండటం విచిత్రం! ఎందుకంటే, ఈయన కూడా తెరాసలో చేరేముందు ఇలానే ప్రయత్నించారు కదా. గతం మరచిపోతే ఎలా..? ఎవరికైనా ప్రాసెస్ అదే కదా. ఆయనా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటపడ్డారు. ఒకవేళ గుత్తాని తెరాసలో చేర్చుకోకపోయి ఉంటే.. ఏవో ఉద్యమాలు అంటూ ప్రజల్లోనే ఉండేవారే. అదే పని ఇప్పుడు కోమటిరెడ్డి చేస్తున్నారు. సరే, ఫిరాయింపు నేతలతో రాజీనామాలు చేయించే సత్తా అధికార పార్టీలకు ఉండదు, చేసేంత నైతికత కండువా మార్చిన నేతల నుంచీ ఆశించలేం! కానీ, నల్గొండ ఉప ఎన్నిక కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు గుత్తా ఈ మధ్య రెడీ అయిపోయారు కదా… దీన్ని అవకాశవాద రాజకీయం అనకూడదా? సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసేవారిని దూరం పెట్టాలంటూ ఇప్పుడు ప్రజలకు పిలుపునిస్తున్నారు! ఆ లెక్కన, ముందుగా పక్కనపెట్టాల్సింది ఎవర్నీ..?