పార్టీలు మారే నేతలు మెళ్ళో కండువాలు వేయించుకోవడం ఒక ఆనవాయితీ. కానీ నిన్న తెరాసలో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోకుండానే తెరాసలో చేరడం విశేషం. తెరాస కండువా కప్పుకొన్నట్లయితే తనపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఆయన తెరాస కండువా కప్పుకోలేదని సమాచారం. తనపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఆయన తన ఎంపి పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. కానీ ఆయన రాజీనామా చేసినట్లయితే మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళవలసి ఉంటుంది. గత రెండేళ్లుగా తెలంగాణాలో వరుసగా ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే పాలేరు ఉప ఎన్నికలు జరిగాయి. కనుక మళ్ళీ ఇప్పుడు మరో ఉప ఎన్నికలకి వెళ్ళడం కంటే సరైన సమయం వచ్చేవరకు ఆగి అప్పుడు గుత్తా చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకి వెళ్ళడం మంచిదని ముఖ్యమంత్రి కెసిఆర్ నచ్చ చెప్పడంతో గుత్తా తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా మరో నలుగురు కాంగ్రెస్ నేతలు నిన్న కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కనుక గుత్తా తెరాస కండువా కప్పుకోకపోయినా, ఆ సమయంలో వారి మద్య ఉండటమే ఆయన తెరాసలో చేరినట్లు నిరూపిస్తోంది. వారు తెరాసలో చేరుతున్నాట్లు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియగానే వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. కనుక వారిపై మండిపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, గుత్తా సుఖేందర్ రెడ్డిపై లోక్ సభ స్పీకర్ కి పిర్యాదు చేయకమానదు. అప్పుడు ఆమె గుత్తాని సంజాయిషీ కోరుతూ నోటీస్ పంపకమానారు. కనుక కల్లు కొచ్చి ముంత దాచడం వలన ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా తలుచుకొంటే గుత్తా సుఖేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేయడం పెద్ద కష్టమైనా పనేమీ కాదు.