ఆలోచనలెప్పుడూ కొత్తగా ఉండాల్సిన పనిలేదు. పాత కథని కొత్తగా చెబితే చాలు. కాకపోతే… దానికి చాలా నైపుణ్యం అవసరం. కొత్త ఆలోచనల్ని.. అర్థమయ్యేలా, అందంగా చెప్పడానికి మరింత ప్రతిభ కావాలి. ఇవాల్టి దర్శకుడు కొత్త పాయింట్ ని బాగానే పట్టుకోగలుగుతున్నారు. కానీ.. దాన్ని చెప్పే నేర్పు, కళ కొంతమందికే అబ్బుతోంది. `గువ్వ – గోరింక`లోనూ ఓ కొత్త పాయింట్ ఉంది. మరి దాన్ని ఇంకాస్త కొత్తగా చూపించేంత కళ దర్శకుడికి ఉందా? ఈ సినిమా ఎలా ఉంది?
సదానంద్ (సత్యదేవ్) మెకానికల్ ఇంజనీర్. సౌండ్ అంటే అస్సలు పడదు. అందుకే.. అస్సలు శబ్దమేచేయని వాహనం కనిపెట్టాలని కలలుకంటుంటాడు. ఏడేళ్లుగా అదే ప్రాజెక్టుపై పని చేస్తుంటాడు. శిరీష (ప్రియాలాల్) కి సంగీతం అంటే ప్రాణం. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ లో పక్క పక్క ఫ్లాటుల్లో ఉంటారు. ఒకరికి శబ్దమే ప్రపంచం, ఇంకొకరికి అదంటేనే ఇరిటేషన్. ఇద్దరి మధ్య గొడవలతో పరిచయం మొదలై, అది స్నేహంగా మారి, ప్రేమగా వికసిస్తుంది. పక్క పక్క గదుల్లో ఉండి చూడకుండానే ప్రేమించుకుంటారు. మరి ఇద్దరూ చివరికి ఎలా కలుసుకున్నారు? ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? అన్నదే మిగిలిన సినిమా.
చాలా ఏళ్ల క్రితం మొదలైన సినిమా ఇది. మధ్యలో కొన్ని ఆటుపోట్లు వచ్చాయి. సినిమా పూర్తయినా విడుదల చేయలేకపోయారు. ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తోంది కదా. ఆ పుణ్యం వల్ల.. గువ్వ – గోరింక బయటకు వచ్చింది. సంగీతమే ప్రాణంలా భావించే అమ్మాయి – అసలు సౌండ్ అంటేనే పడని అబ్బాయి మధ్య ఓ ప్రేమకథ మొదలైతే ఎలా ఉంటుంది? అన్నది దర్శకుడి పాయింట్. పైగా ఇద్దరూ పక్క పక్క గదుల్లో ఉంటూ చూడకుండానే ప్రేమించుకోవాలి. అనగానే.. నిర్మాత, సత్యదేవ్ ఎగ్జైట్ అయి ఉండాలి. ఇప్పుడంటే సత్యదేవ్ కి ఓ ఇమేజ్ వచ్చి, కథల్ని ఎంపిక చేసుకునేంత వెసులు బాటు వచ్చింది. `గువ్వ – గోరింక` టైమ్ లో అవకాశం రావడమే గొప్ప. అందుకే సత్యదేవ్ మారు మాట్లాడకుండా ఈసినిమా ఒప్పుకుని ఉంటాడు.
ముందే చెప్పినట్టు కొన్ని పాయింట్లు వినడానికి బాగుంటాయి. స్క్రీన్ ప్లేలో దిగాకనే అది సినిమాగా మారడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. `గువ్వ – గోరింక` అదే సమస్యని ఎదుర్కొంది. చిన్న కథ. దాన్ని ఎలాంటి విసుగూ లేకుండా చెప్పాలి. ఆ విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఈ ప్రేమకథకు సమాంతరంగా, లివింగ్ టుగెదర్ అంటూ మరో జంట కథ చెప్పి, అమ్మాయిల్లో కామాన్ని తప్ప, ప్రేమని చూడని ప్రియదర్శి లాంటి క్యారెక్టర్ని దూర్చి – ఈ మూడు కథల్ని సమాంతరంగా పేర్చాడు. ఇన్ని ఉప కథలు జోడిస్తే తప్ప రెండు గంటల ఫుటేజ్ రాలేదంటే, తాను రాసుకున్న మెయిన్‌పాయింట్ ఎంత బలహీనంగా ఉందో అర్థం అవుతుంది. ఇలా చూడకుండా ప్రేమించుకోవడం ఇప్పటి ఫార్ములా కాదు. ప్రేమలేఖ నుంచీ ఉంది. ఇలాంటి కథ తెరపై చూస్తున్నప్పుడు హీరో, హీరోయిన్లు ఎప్పుడు కలుసుకుంటారో… అనే ఆత్రుత ప్రేక్షకుడికి కలగాలి. ఇద్దరూ త్వరగా కలిస్తే బాగుంటుంది అనుకోవాలి. ఆ ఫీల్ ప్రేక్షకుడిలో తీసుకురావడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఫ్లాటూ, గ్యారేజూ తప్ప.. మరో లొకేషన్ కనిపించదు. దాంతో.. సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గ్యారేజ్‌లో నడిపించిన కామెడీ ఏమాత్రం పండలేదు. సరికదా.. దర్శకుడిలో విషయం లేదన్న విషయాన్ని ఆయా సన్నివేశాలు మరింత బహిర్గతం చేస్తుంటాయి. సోషల్ మీడియా వ్యవహారాలన్నీ ఓ పాటలో చెప్పడం బాగుంది కానీ, ఈ కథకూ, ఆపాటకూ.. అస్సలేమాత్రం సంబంధమే లేదు. బిత్తిరి సత్తి ఎపిసోడ్ అయితే… అనవసరమైన సాగదీత. మంగ్లీ ని తీసుకొచ్చి ఇరికించిందీ.. సన్నివేశాల్ని పొడిగించుకోవడానికే.
సత్యదేవ్‌లోని నటుడ్ని గదిలో ఇరికించేసిన ఫీలింగ్ కలుగుతుంది. చిత్రీకరణలో చాలా గ్యాపులు వచ్చినట్టున్నాయి. అందుకే సత్యదేవ్ ఆహార్యం ఒక్కోసీన్లో ఒక్కోలా కనిపించింది. ప్రియలాల్ ది హీరోయిన్ ఫేస్ కట్ కాదు. హీరోయిన్లంతా అందంగానే ఉండాలన్న రూల్ లేదు. కనీసం.. కొంతమంది చూడగా చూడగా నచ్చుతారు. ప్రియలో ఆ ఛాన్స్ కూడా లేదు. నటిగా సూపరా.. అంటే అక్కడా యావరేజ్ మార్కులే. ప్రియదర్శి లో కామెడీ యాంగిల్ ని ఏ మాత్రం వాడుకోలేదు. రాహుల్ రామకృష్ణ కూడా అంతే.
పాటలు ఒకే అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ కూల్ గా ఉంది. కొన్ని పరిధులు, పరిమితులకు లోబడి ఈ సినిమా నిర్మించారు. గుర్తించుకుని, ఆ తరవాత మెచ్చుకుందామనే స్థాయిలో డైలాగులు లేవు. దర్శకుడు రాసుకున్న పాయింట్ ఓకే. దాన్ని సినిమాగా మార్చి, రెండు గంటల పాటు అదే ఫీలింగ్ తీసుకురావడంలో మాత్రం.. తడబాటు కనిపించింది.
ఫినిషింగ్ టచ్: రెక్కలు తెగిన పక్షులు