ఫైబర్ నెట్ ను వైసీపీ తమ పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చేందుకు ఉపయోగించుకుంది. ముగ్గురు శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పదమూడు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగోలు ఉన్నారని బయటకు వచ్చింది. అసలు వీరంతా ఎవరు.. ఏం చేస్తారన్నది కూడా తెలియదని ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చెబుతున్నారు. నెలకు రూ. కోట్ల జీతాలు చెల్లిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికీ వారిని తీసేశారో లేదో స్పష్టత లేదు.
విజయసాయిరెడ్డి వాట్సాప్ లో సిఫారసు చేసిన మేరకు శాంతి చెల్లెళ్లకు ఉద్యోగాలిచ్చారని వారిని తొలగించామని మాత్రం చెబుతున్నారు. మరి మిగతా వారి సంగతేంటి ?. వారిని తొలగించారో స్పష్టత లేదు. ఫైబర్ నెట్ విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని చెబతుున్నారు. ఆరు నెలలు గడిచినా ఇంత వరకూ విజిలెన్స్ విచారణ పూర్తి కాకపోవడంపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది.
డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ ద్వారా వైసీపీకి పూర్తి స్థాయి ప్రచారం చేసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు ఇచ్చారు. ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. కానీ చర్యలు మాత్రం ఇంకా దూకుడుగా ప్రారంభం కాలేదు. కొత్త ఏడాదిలో అయినా ఈ లెక్కలు తేల్చి ప్రజాధనాన్ని బొక్కిన వారిని కటకటాల వెనక్కి పంపాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రభుత్వం తీరు చూస్తే అయిందేదో అయిపోయిందన్నట్లుగా ఉండటమే వారిని నిరాశ పరుస్తోంది.