బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి… జీవీఎల్ నరసింహారావు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికే తన సమయం అంతా వెచ్చిస్తున్నారు. విజయవాడలోనే మకాం వేసి రోజూ ప్రెస్‌మీట్ పెడుతున్నారు. చంద్రబాబును డిఫెన్స్‌లో పెట్టడానికి తన మాటల చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు. మూడు రోజుల క్రితం… ఎయిర్ ఏషియా సంస్థకు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు మాట్లాడుకున్నట్లు చెబుతున్న ఆడియో టేపులు విడుదలయ్యాయి. దీనిలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. ఆ సంస్థ అవకతవకలకు పాల్పడిందని… సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని మరింత హైలెట్ చేసేందుకు జీవీఎల్ నరసింహారావు విజయవాడలో… మీడియా సమావేశం నిర్వహించారు. దర్యాప్తు సంస్థలు తన పని తాను చేసుకుపోతాయని…తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అదే సమయంలో కేంద్రానికి సంబంధించి ఓ భారీ కుంభకోణాన్ని బయటపెట్టబోతున్నామని.. సంచలన ఆధారాలతో నేరుగా కోర్టులో పిటిషన్ వేయబోతున్నామని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రకటించడంపైనా జీవీఎల్ స్పందించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని ఎలా దోచిపెట్టారో.. తాము నిరూపిస్తామని… దీంతో కేంద్రప్రభుత్వంలో ప్రకంపనలు రావడం ఖాయమని కుటుంబరావు చెప్పారు. అయితే కుటుంబరావు బయటపెడతానన్న స్కాం గురించి పెద్దగా స్పందించని..జీవీఎల్ అసలు.. కుటుంబరావుపైనే నిందలేసే ప్రయత్నం చేశారు. ఆయన సామర్థ్యాన్ని శంకించే ప్రయత్నం చేశారు. షేర్ మార్కెట్ నిపుణులడైన కుటుంబరావును ప్రణాళికాసంఘంలో తెచ్చి పెట్టారని విమర్శించేశారు. కానీ సెఫాలజిస్ట్‌గా… దూరదర్శన్‌లో ఎగ్జిట్ పోల్స్‌ను విశ్లేషించుకునే… జీవీఎల్ నరసింహారావును బీజేపీ ఎంపీని చేసింది. ఎంపీ పదవికి సెఫాలజిస్ట్ అర్హుడైనప్పుడు… షేర్‌మార్కెట్ ఎక్స్పర్ట్ .. ప్రణాళికా సంఘానికి పనికి రారా అని టీడీపీ నేతలు అప్పుడే విమర్శలు ప్రారంభించారు.
కుటుంబరావుపై జీవీఎల్ విమర్శలకు మరో కారణం కూడా ఉంది. కొద్ది రోజులుగా… ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై టీవీ చానళ్లు నిర్వహిస్తున్న చర్చల్లో.. జీవీఎల్ వర్సెస్ కుటుంబరావు అన్నట్లుగానే వ్యవహారం సాగుతోంది. పూర్తి ఆధారాలతో.. సాధికారికంగా… కుటుంబరావు .. అన్ని విషయాలను ప్రస్తావిస్తూంటారు. దేనికీ.. జీవీఎల్ నరసింహారావు సరైన సమాధానం చెప్పలేరు. జాతీయ అధికార ప్రతినిధి అయి ఉండి.. ఏపీకి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పడానికి ఆయన తడబడుతూంటారు. ఈ అంశాన్ని కుటుంబరావు చక్కగా వినియోగించుకుని బీజేపీని దోషిగా నిలబెడుతూంటారు. ఈ కసి ఈ రోజు జీవీఎల్‌లో కనిపించింది. అందుకే.. అసలు కుటుంబరావు అర్హతలపైనే విమర్శలు చేసేశారు. కానీ ఈ వాదన కరెక్ట్ కాదేమో..?