ఇప్పటికి హోదా లేదు.. భవిష్యత్లో ఏం జరుగుతుందో తెలియదు..! అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏపీ విభజన జరిగినప్పటి నుంచి ప్రత్యేక హోదా హామీ సాధన కోసం రాజకీయ పార్టీలు ప్రధాన అస్త్రంగా మలుచుకుని పోరాడాయి. హోదా సాధించడమే తమ లక్ష్యమని పదే పదే ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాయి.
ఏపీకి హోదా ఇస్తామన్నట్లుగా జీవీఎల్ ప్రకటనలు..!
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. ఏపీకి వచ్చిన జీవీఎల్.. కొత్త ప్రభుత్వం కేంద్రంతో సన్నిహతంగా వ్యవహరిస్తే ప్రత్యేకహోదా విషయంలో భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చని ప్రకటించారు. కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో ముందే చెప్పలేమని… ప్రత్యేక హోదా వ్యవస్థ ప్రస్తుతం లేనందున ఇవ్వటం కుదరలేదన్నారు. ప్రత్యేక హోదా వ్యవస్థ పునరుద్దరణ జరిగితే ఏపీకి హోదా రావాలనుకునేవారిలో తామే ముందుంటామన్నారు. పరిస్థితుల ఆధారంగా వ్యవస్ధలో ఏమైనా మార్పులు వస్తే ప్రత్యేక హోదా అవకాశం ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని..కాని భవిష్యత్త్ లో ఎలా ఉంటుందో చెప్పలేమంటూ జీవిఎల్ జగన్ ఢిల్లీ టూర్ కు ముందు మాట్లాడటం చర్చకు దారితీస్తోంది.
టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు.. ఒక్క సారి కూడా ఇలా మాట్లాడలేదే..?
నాలుగేళ్ల పాటు నమ్మకమైన మిత్రపక్షంగా ఏకంగా.. ప్రభుత్వంలోనే టీడీపీ భాగస్వామిగా ఉండి ప్రత్యేకహోదాను అడిగితే.. కనీసం ఈ మాత్రం మాటలు కూడా చెప్పని.. జీవీఎల్… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే… సన్నిహితంగా ఉంటే చాలు.. హోదా వస్తుందన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ సొంతగానే అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కీలక బిల్లుల ఆమోదం విషయంలో తప్ప ఎన్డీఏలోని ఇతర పార్టీల మద్దతు ఆ పార్టీకి అవసరం ఉండదు. ఈ కారణంతోనే అప్పట్లో మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ పలు మార్లు విజ్ఞప్తిని చేసినా..ఎన్ని విధాలుగా పోరాడినా ..బీజేపీ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. పైగా…. పోరాటాలకు మాత్రం ప్రొత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ కోసం ఏపీకి ప్రత్యేకహోదాను ప్రకటిస్తారా అన్నది కీలకం.
ఎవరైతే ఏంటి… ఏపీకి హోదానే కదా ముఖ్యం..?
బీజేపీకి రహస్య మిత్రుడుగా కొనసాగిన జగన్ ఇప్పుడు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు కేంద్రం వైఖరి మారుతుందా..ఏపీలో ప్రభుత్వం మారడంతో నిర్ణయంలో మార్పు ఉంటుందా ..? అన్న చర్చ ప్రారంభమయింది. ఈ విషయంలో.. జీవీఎల్ ఆలోచనలేమిటో కానీ… త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.