ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నామన్నారు భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. భాజపా రాష్ట్ర ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు ఇంట్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ 9న రాష్ట్రానికి వస్తున్నారనీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ కార్యక్రమాలపై చర్చించామన్నారు. దీంతోపాటు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా మాట్లాడామన్నారు. తాము ఊహించినట్టుగానే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిందన్నారు. ఆ తరువాత, రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై మాట్లాడామన్నారు.
దేశమంతా భాజపా ఒక ఊపు ఊపితే… ఆంధ్రాలో అస్సలు దాని ప్రభావం కనిపించలేదన్నారు జీవీఎల్. ఆంధ్రాలో నరేంద్ర మోడీ వేవ్ ని భాజపా మిస్సయిందన్నారు. అయితే, ఆ వేవ్ ని త్వరలో ఆంధ్రప్రదేశ్ చూస్తుందనీ, దేశవ్యాప్తంగా భాజపాకి ఊపు వచ్చినట్టుగానే అలాంటి తరహా అనుభవం భాజపాకి ఇక్కడా రాబోతోందన్నారు! భాజపా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనేది లక్ష్యమన్నారు. ఏపీకి సంబంధించి త్వరలోనే పెద్దపెద్ద నిర్ణయాలు చేసే అవకాశం ఉందన్నారు జీవీఎల్. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకున్నంత మాత్రాన పార్టీ బలోపేతం కాదనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద నాయకుడు వచ్చి చేరతామన్నా… ఆయనకు సంబంధించి అన్ని విషయాలపై ఎంక్వయిరీ చేసుకున్నాకని, పార్టీలో పెద్ద స్థాయిలో చర్చ జరిగాకనే చేరికలు ఉంటాయని జీవీఎల్ అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని భాజపాలో చేరతారనే వార్తలపై స్పందిస్తూ, తాము ఎవ్వరినీ చేర్చుకోవాలనే ప్రయత్నాలు ఎక్కడా లేవనీ, సభ్యత్వాన్ని పెంచుకోవడంపై మాత్రమే తమ దృష్టి ఉందన్నారు.
ఏపీకి సంబంధించి పెద్దపెద్ద నిర్ణయాలు త్వరలో ఉంటాయని జీవీఎల్ అనడం విశేషం. వాస్తవానికి, ఏపీలో పార్టీ మరింత బలపడాలంటే… బలమైన నాయకుల అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి వలసలను ప్రోత్సాహించే అవకాశం కూడా ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా… కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, కొంత హనీమూన్ పీరియడ్ పూర్తయ్యాక భాజపాలోకి వలసలుంటాయనే అంచనాలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నది వారే కాబట్టి, రాష్ట్రంలో ఎవరినైనా తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు కావాల్సిన ఎన్నో మార్గాలకు భాజపాకి ఓపెన్ గా ఉంటాయి కదా!