తెలంగాణలో పోటీ అంటే తెరాస వెర్సెస్ మహా కూటమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో భాజపా ఉన్నా కూడా… అది తెరాసకు వ్యతిరేకంగా పోటీ దిగే అవకాశాలు చాలా తక్కువ అనే ఒక స్పష్టమైన విశ్లేషణ చేసుకునేందుకు అనువుగానే రెండు పార్టీల మధ్యా పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడారు! నిజానికి, ఆయన ఎప్పుడూ ఆంధ్రా మీద ఫోకస్ పెట్టి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ… ఆయన ఇంటిపై ఐటీ దాడులు చేయించాల్సిన అవసరం తమ పార్టీకి ఏముందన్నారు. తెరాస ఎంపీ ఇంటిపై కూడా దాడులు జరిగిన సంగతి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
రాజకీయాలు పేరు చెప్పి తప్పించుకునేందుకే ఇలా భాజపాని మధ్యలోకి లాగుతున్నారంటూ జీవీఎల్ విమర్శించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తెరాసకు ప్రధాన పోటీదారు భాజపా మాత్రమే అన్నారు! తెరాసను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో భాజపా ఎన్నికలకు దిగుతోందనీ, ఆ మేరకే వ్యూహ రచన జరుగుతోందని జీవీఎల్ స్పష్టం చేశారు. వాస్తవం మాట్లాడుకుంటే… తెరాసతో పోటీ పడే స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉందా..? ఇంకోటి, తెరాస భాజపాల మధ్య రహస్య స్నేహం లేదని తెలంగాణ సమాజం భావిస్తోందా..? అసెంబ్లీ రద్దు… అంతకుముందు ప్రధానితో కేసీఆర్ రాసుకు పూసుకుని తిరడం, అనంతరం ముందస్తు ఎన్నికలకు అనుకూలంగా అన్ని వ్యవస్థల నుంచీ మార్గం సుగమం అవుతూ ఉండటం… ఈ పరిస్థితుల మధ్య నుంచీ కేసీఆర్, మోడీల స్నేహాన్ని ప్రజలు గుర్తించలేరని అనుకుంటున్నారా..? నిజానికి, వాస్తవ పరిస్థితుల ఎలా ఉన్నా జీవీఎల్ కి అనవసరం అనుకోండి!
అసెంబ్లీ రద్దు చేసిన తరువాత ఘనంగా వందకుపైగా స్థానాల్లో తెరాస అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించేశారు. భాజపా బలంగా ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ భాజపాను ప్రధాన ప్రత్యర్థి స్థాయి అని తెరాస అనుకుని ఉంటే.. కేసీఆర్ స్పందన మరోలా ఉండేది! దానికి అనుగుణంగా ముందస్తు ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా మార్పులూ చేర్పులూ వాయిదాలూ వంకలూ చాలానే వచ్చి ఉండేవన్నది వాస్తవం. అయితే, ఓపక్క మహా కూటమి ఏర్పడింది కాబట్టి… దానికి పోటీగా తెరాస, భాజపా కూటమి ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఒక అభిప్రాయం నెమ్మదిగా ప్రజల్లో ఏర్పడుతోంది కాబట్టి… అలాంటి చర్చకు ఇప్పట్లో ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో జీవీఎల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. లేదంటే, తెరాసతో పోటీ పడే స్థాయిలో భాజపాగానీ, భాజపాను వ్యతిరేకించే పరిస్థితిలో తెరాసగానీ ఇప్పుడైతే లేవనే చెప్పాలి.