భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు … ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక పరోక్షంగా పంపారు. బీజేపీకి ఏ మాత్రం పొసగని.. ఓ పనిని..జగన్మోహన్ రెడ్డి నిస్సంకోచంగా చేశారు. అదే ఇఫ్తార్ విందు ఇవ్వడం. ప్రభుత్వం అధికారికంగా.. గుంటూరులో ఇచ్చిన ఇఫ్తార్ విందులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. దాని కోసం.. రూ.కోటికిపైగా ఖర్చు చేశారని.. జీవోతో సహా తేటతెల్లమయింది. ఇది బీజేపీ అధికార ప్రతినిధి.. జీవీఎల్‌ను మనస్తాపానికి గురి చేసింది. అయితే… జగన్మోహన్ రెడ్డి… అప్రకటిత మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి..మొట్టమొదటి తప్పుగా భావించారేమో కానీ..నేరుగా హెచ్చరికలు జారీ చేయలేదు. చాలా పద్దతిగా…సూచనల్లాంటివి పంపారు. కానీ.. తరచి చూస్తే.. జీవీఎల్ చేసిన ప్రకటనలో… వైసీపీకి చాలా తీవ్రమైన హెచ్చరికలే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
నిజానికి జీవీఎల్ చేయాల్సిన ట్వీట్లో చంద్రబాబు ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం లేదు. కానీ..చంద్రబాబు.. ధర్మపోరాట దీక్షల పేరుతో డబ్బులు వృధా చేశారని.. ఏపీ ఓ లోటు బడ్జెట్ రాష్ట్రమని… గుర్తు చేశారు. కింద.. ఇఫ్తార్ విందు కోసం… రూ. కోటికిపైగా ఖర్చు పెట్టినట్లుగా ఉన్న ఆర్టికల్‌ను షేర్ చేశారు. అంటే.. ఇలాగే కొనసాగితే.. చంద్రబాబుకు జరిగినట్లే జరుగుతుందని..జీవీఎల్ పరోక్షంగా హెచ్చరించారన్నమాట. జీవీఎల్ నరసింహారావు..తెలుగు రాష్ట్రాలను..ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తరపున .. ఆయనే మోదీ,అమిత్ షాల వద్ద బాధ్యత తీసుకున్నారు. దాని ప్రకారమే..టీడీపీని టార్గెట్ చేశారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చి ప్రెస్ మీట్ వేదికగా సుద్దులు చెప్పి వెళ్లారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి వాటిని పట్టించుకున్నట్లు లేరు.
బీజేపీ మనసెరిగితే.. ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చి ఉండేవారు కాదు… ఇచ్చినా వెళ్లి ఉండేవారు కాదు. జీవీఎల్… మొదటి సారిగా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై… అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అఫీషియల్ అనుకోవాలేమో..!. నిజానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా.. ఈ ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. వాటిపై జీవీఎల్.. ఎందుకు కామెంట్ చేయలేదో కానీ… ఏపీ ప్రభుత్వ విందుపై మాత్రం.. అసంతృప్తి వ్యక్తం చేశారు.