అమిత్ షాపై తనకు గౌరవమని.. భారతీయ జనతా పార్టీతో కలిసే ఉన్నానని.. పవన్ కల్యాణ్ చెప్పడం.. బీజేపీ నేతలకు అమితమైన ఉత్సాహాన్నిస్తోంది. అయితే.. వారు బయటపడకుండా… మరింత ఎక్స్ట్రీమ్ ఆలోచనలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ విలీనానికి ఒప్పుకుంటే.. తమకు అభ్యంతరం లేదని.. జీవీఎల్ నరసింహారావు తెరమీదకు వచ్చేశారు. జనసేన పార్టీని విలీనం చేయాలనే ప్రతిపాదనను.. తాము ఎప్పుడో పెట్టామని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా గతంలో చెప్పారు. అప్పుడు పవన్ కూడా.. తాను పాతికేళ్ల రాజకీయం కోసం.. పార్టీ పెట్టానని కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కల్యాణ్…బీజేపీకి దగ్గరగా కలసి ఉన్నామని చెప్పారే కానీ.. విలీనం చేస్తామని చెప్పలేదు. కానీ.. జీవీఎల్ మాత్రం… పొత్తులు కాదు.. విలీనం అంటూ బెట్టు చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కాస్త స్నేహాన్ని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. అధికారం అండతో… బూతులు తిట్టడమే కాదు.. దాడులకూ వెనుకాడటం లేదు. అధికార పార్టీ నేతల ఆగడాలను అడ్డుకోవాలంటే.. వారు భయపడేవారి అండ కోరుకుంటున్నారు. ఆ అండ బీజేపీ దగ్గర ఉంటుందనుకుంటున్నారు. అందుకే..బీజేపీతో స్నేహం చేస్తున్నట్లుగా.. టీడీపీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. బహుశా పవన్ కల్యాణ్ కూడా.. అదే ఉద్దేశంలో అని ఉంటారు కానీ… కనీసం పొత్తుల గురించి కానీ… విలీనం గురించి కానీ.. ఆయన ఆలోచించి ఉంటారని.. ఆ ఉద్దేశంతో.. కలిసున్నామనే మాటలు మాట్లాడి ఉంటారని కూడా ఎవరూ అనుకోరు.
ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటో గత ఎన్నికల్లో తేలిపోయింది. నోటాకు వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదు. అలాంటి పార్టీ… కేసుల భయంతోనే.. మరో కారణంతోనే పార్టీలో చేరేవారితో బలపడిపోతున్నామని భావిస్తోంది. అది కూడా.. వారి దగ్గర ఉన్న అధికారాన్ని చూసి మాత్రమే… చేరుతున్నారు. రేపు బీజేపీకి ఎదురుగాలి ప్రారంభమయిందన్న వాతావరణం ఏర్పడితే.. అందులో చేరిన వారంతా.. వెనక్కి వస్తారు. ఇప్పటికీ.. చాలా మంది రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నామని బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి వారు ఎన్నికల సమయం వద్దకు వచ్చే సరికి ఎక్కడుంటారో అంచనా వేయడం కష్టం. ఇవేమీ తెలియనట్లే.. జీవీఎల్.. పవన్ కల్యాణ్ మాటలను అడ్వాంటేజ్‌గా తీసేసుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.