యుద్ధం వస్తుందని భారతీయ జనతా పార్టీ నేతలు.. తనకు రెండేళ్ల కిందటే చెప్పారని.. పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరికి పాకిస్తాన్ మీడియాకు కూడా హాట్ టాపిక్ అయింది. గతంలో బీజేపీ నేతలతో.. పవన్ కల్యాణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో… అలా చెప్పి ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. ఇది బీజేపీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూండటంతో… ఆ పార్టీకి చెందిన ఎంపీ, తెలివి తేటల్లో తనకు మించిన రాజకీయ నేత ఉండరు అనుకునే… ఉత్తరప్రదేశ్ ఎంపీ .. జీవీఎల్ నరసింహారావు రంగంలోకి దిగిపోయారు. హుటాహుటిన విజయవాడ వచ్చి ప్రెస్‌మీట్ పెట్టారు. పవన్ కల్యాణ్ ఆన్న అ మాటల వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. చంద్రబాబుదేనంటూ.. కొత్త ఆరోపణలు ప్రారంభించారు.
పీకే అంటే పాకిస్తాన్ మనిషి అనుకుంటున్నారని .. విమర్శలు గుప్పించారు. పవన్ అన్న మాటల్లో పదాలను మార్చి.. రెండేళ్ల కిందటే యుద్ధం వస్తుందని పవన్‌కి ఎవరో చెప్పారంటున్నారని. చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ నేతలే అన్నారని పవన్ ప్రకటించారు. ఈ మాటలను మసి పూసి మారేడు కాయ చేయాడనికి జీవీఎల్ నరసింహారావు… చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు లింక్ పెట్టడం ప్రారంభించారు. దీనికి సాక్ష్యంగా.. గతంలో చంద్రబాబును, లోకేష్‌ను పవన్ కల్యాణ్ తిట్టేవారని.. ఇప్పుడు తిట్టడం లేదని.. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలన్నట్లు ఆయన చెబుతున్నారు.
జీవీఎల్ నరసింహారావుకు..ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారని అది ఆయన చదువుతారని అనుమానం కలిగేలా.. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో పవన్ కల్యాణ్ నటించిన “అధికారానికి దారేది..?” సినిమాలో డైలాగ్‌ను ఉదహరరించారు. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది అనే సినిమాలో నటించారు. అది కూడా ఆయనకు తెలియదు. కానీ అందులో డైలాగ్‌ను మాత్రం… బట్టీపట్టి చెప్పారు. “ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నవాడే నాయకుడు..”అని పవన్ కల్యాణ్ ఆసినిమాలో చెప్పారని.. ఇప్పుడది ఆయన నిజంగానే నేర్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లే పవన్ కల్యాణ్ చెబుతున్నారని విమర్శించారు. మొత్తానికి బీజేపీ దేశభక్తి అంతా… డొల్లేనని తాజా పరిణామాలోత తెలియడంతో.. ఎలా కవర్ చేసుకోవాలో తెలియక.. జీవీఎల్ కంగారులో.. ఒకటికి రెండు తప్పులు చేస్తున్నారన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతోంది.