ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, రాష్ట్రంలో భాజపా ఎదుగుదల గురించి ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు జనసేనను భాజపాలో విలీనం చేయాలంటూ ప్రతిపాదనలు వచ్చాయని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారన్న అంశం ప్రస్థావనకు వచ్చినప్పుడు… ఆ పరిస్థితి ఎన్నికలకు ముందు మాత్రమే ఉందనీ, ఇప్పుడు జనసేన పార్టీ అనేదే రాష్ట్రం లేదని వ్యాఖ్యానించారు జీవీఎల్! పవన్ కల్యాణ్ కి వ్యక్తిగతం మాత్రమే స్టార్ ఇమేజ్ ఉందన్నారు. ఆయనకు వ్యవస్థాగతమైన ఆలోచన విధానం లేదనీ, సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, గత ఎన్నికల్లో భాజపా కంటే జనసేనకు ఎక్కువ ఓట్లే పడ్డాయనీ, అవి కూడా సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా మాత్రమే పడ్డవే ఎక్కువ అన్నారు.
ఇక, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ… తమతో పొత్తు వదులుకుని ఆంధ్ర్రదేశ్ లో తాము ఈరోజున ఒక శక్తిగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇచ్చారన్నారు! ఆంధ్రాలో టీడీపీ కొనసాగే పరిస్థితి లేదనీ, ఆ స్థానాన్ని తాము భర్తీ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారనీ, అయితే చేరికలకు తాత్కాలికంగా ఒక బ్రేక్ ఇచ్చామనీ, వస్తామన్న వారి గురించి పార్టీలో చర్చ జరుగుతోందన్నారు! త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ కొనసాగుతుందన్నారు. టీడీపీ గ్రాఫ్ రానురానూ కిందికి పడిపోతోందనీ, మరో రెండుమూడేళ్లలో అదొక చిన్న పార్టీగా కూడా కనిపించే పరిస్థితి ఉండదన్నారు! అయితే, చంద్రబాబు నాయుడు మీద భాజపాకి ఎలాంటి రాజకీయ కక్ష భాజపాకి లేదన్నారు. భాజపాతో కలిసి పోటీ చేయాలనే ధోరణి టీడీపీకి భవిష్యత్తులో ఉండొచ్చేమోగానీ, భాజపా ఎప్పుడూ అలాంటి పని చెయ్యదన్నారు జీవీఎల్.
భాజపా ఎదగాలంటే జనసేన, టీడీపీలు లేకుండా పోవాలనేదే ఆ పార్టీ వ్యూహం ఉందా అన్నట్టుగా జీవీఎల్ వ్యాఖ్యలున్నాయి. వాస్తవానికి, భాజపాకి ఏపీలో ఇంతవరకూ పట్టు ఏమీ లేదు. కొందరు నాయకులు ఈ మధ్య పార్టీలో చేరి ఉండొచ్చేమోగానీ, వారు కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకున్నవారు కాదు! రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలని, ఆ రెండో పార్టీ తమదే అన్నట్టుగా జీవీఎల్ మాట్లాడుతున్నారు. కానీ, వాస్తవంలో ఏపీలో భాజపా నాలుగో స్థానంలో ఉంది! ఇంకోటి, జీవీఎల్ చెబుతున్నట్టు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి భాజపా అని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడుంది..? కేంద్రంలో అధికారంలో ఉండి కూడా గత ఐదేళ్లూ ఏపీకి ఏమీ చెయ్యలేదన్న ఆగ్రహమే ప్రజల్లో ఉంది. ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా భాజపా రాష్ట్రానికి ఏదో చేసేస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదు! ఏపీకి ఏదీ చెయ్యకుండా ప్రత్యామ్నాయంగా ప్రజలు తమనే చూస్తున్నారు అనడంలో ప్రమాణికత ఎక్కడుంది..?