యూపీ నుంచి ఎంపీగా ఎన్నికై ఏపీలో బీజేపీ ప్రముఖ నేతగా మారిన జీవీఎల్ నరసింహారావు… ఇప్పుడు విశాఖలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయనకు బీజేపీ అధికార ప్రతినిధి పదవి కూడా లేదు. ఆయనకు ఎంపీ పదవి ఒక్కటే ఉంది. అదీ త్వరలో ముగిసిపోతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేస్తారన్న గ్యారంటీలేదు. అందుకే ఆయన ముందు చూపుతో విశాఖలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. టీడీపీతో పొత్తుంటే ఎలాగూ విశాఖ తీసుకుంటామని… అక్కడ పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లిపోవాలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
పదే పదే జీవీఎల్ విశాఖలో ప్రత్యక్షమవుతున్నారు. కొంత మంది స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. సీనియర్లు మాత్రం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. జీవీఎల్ స్వస్థలం ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చే బల్లికురవ. నర్సరావుపేటలోనూ ఆయన బంధువర్గం ఉంది. గతంలో ఆయన అక్కడే రాజకీయాలు చేసేవారు. కానీ ఇప్పుడు వ్యూహం మార్చుకున్నారు. వైసీపీ మూడు రాజధానులకు మొదటి నుంచి జీవీఎల్ పరోక్ష మద్దతు ఇస్తున్నారు. పైకి మాత్రం అమరావతికే బీజేపీ మద్దతంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తెర వెనుక మాత్రం వైసీపీకి సహకరిస్తున్నారు .
ఇప్పుడు కూడా అంతే చెబుతున్నారు . బీజేపీ కి అమరావతే ముఖ్యమంటున్నారు కానీ వారి తీరు వల్ల ఎవరూ నమ్మలేని పరిస్థితి. అమరావతి రైతులే మొహం మీద అనేస్తున్నారు. ఇప్పుడు జీవీఎల్ విశాఖలోనే మకాం వేయడానికి రాజకీయ పరమైన కారణాలా.. లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అన్నది ముందు ముందు తేలాల్సి ఉంది.