“సర్వే ఫలితాలను చూసి ఆనందపడవద్దు… ఒక్క శాతం ఓట్లొచ్చిన రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం..” .. ఇదీ… లగడపాటి రాజగోపాల్ సర్వే సంస్థ ఆర్జీస్ ఫ్లాష్ టీం… ఆంధ్రజ్యోతి కోసం చేసిన సర్వే ఫలితాలపై… బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందన. ఫలితాలు నిరాశజనకంగా ఉంటే సర్వే తప్పు అని.. ప్రజాభిప్రాయం వేరేలా ఉందని చెప్పుకోవడం కామనే కానీ… జీవీఎల్ స్పందన మాత్రం కాస్త భిన్నంగానే ఉంది. ఓట్లతో తమ పార్టీకి సంబంధం లేదని.. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. ఆయన నేరుగా చెప్పేశారు. అది ప్రజాస్వామ్య విరుద్ధమన్న ఆలోచన జీవీఎల్‌కు రాకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రజాతీర్పుతో తమకు సంబంధం లేదన్నట్లుగా… ఆయన మాట్లాడటం బీజేపీ వర్గాలను సైతం విస్మయపరిచింది.
ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ కొద్ది రోజులుగా విభిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాము గెలవకపోయినా పర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును ముఖ్యమంత్రిని కానీయబోమని శపథం చేసినట్లు ఢిల్లీలో బీజేపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. మీడియా చిట్ చాట్ల పేరుతో… తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శులు వారానికోసారి ఇలాంటి హెచ్చరికలు పంపుతూనే ఉంటారు. వీటిని బలపరిచేలా.. జీవీఎల్ నరసింహారావు తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాతీర్పు ఎలా వచ్చినా సీఎంగా చంద్రబాబు ఉండరనేది… బీజేపీ నుంచి వచ్చే లీక్. ఇప్పుడు జీవీఎల్ కూడా దాదాపుగా అదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి.. ఒక్క శాతం ఓట్లొచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయన్నారు. అంటే… ప్రజాతీర్పుతో సంబంధం లేకుండా.. ఏపీలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉందా..? అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి.
నిజానికి ప్రజాస్వామ్య సంప్రదాయాలను మంటగలపడంతో.. బీజేపీకి చాలా చెడ్డ పేరు ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ చేసిన రాజకీయాల కారణంగా … మాజీ ముఖ్యమంత్రి కలికో ఫుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసిన సూసైడ్ నోట్… సంచలనం సృష్టించినా.. మరుగున పడిపోయింది. ఉత్తరాఖండ్‌లో అన్యాయంగా విధించిన రాష్ట్రపతి పాలన కొట్టి వేసినందుకు… అక్కడి హైకోర్టు చీఫ్ జస్టీస్… కేఎం జోసెఫ్ ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో… కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ చేసిన రాజకీయాలు కూడా ఆ కోవలోకే వస్తాయి. రాజ్యాంగ, అధికార వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేయడానికి బీజేపీ ఏ మాత్రం వెనుకాడలేదు. చివరికి పరువు పోయే పరిస్థితి రావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు.
ఒక్క శాతం ఓట్లు ఉన్నా… తమ పనితీరుతో ప్రజల మనసుల్ని గెలుచుకుంటామని… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబితే దానికో అర్థం ఉంటుంది. కానీ ఒక్క శాతం ఒట్లు వచ్చినా… ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం తమకు తెలుసన్నట్లు.. జీవీఎల్ మాట్లాడటం… కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్ధమేనన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీలను చీల్చి.. ఎమ్మెల్యేలను కొని ఏర్పాటు చేసే ప్రభుత్వాలే.. బీజేపీ విజయాలన్నట్లు జీవీఎల్ ఘనంగా చెప్పుకోవడం.. ఏపీలోనూ అలానే చేస్తామన్నట్లుగా బెదిరింపులకు దిగడం… ఆ పార్టీ నేతలు కూడా సమర్థించుకోలేనిదే.