ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు. వెంటనే ఏం కావాలీ… ఆ పూటకి భోజనం అందించాలి! అలా కాదు బాబూ… నీ కోసం వ్యవసాయం చేయడం ఇప్పుడే మొదలుపెట్టాను, పొలం దున్ని, చేను వేసి, పంట పండించి, కోత కోసి, కుప్ప నూర్చి… ఆ తరవాత అన్నం వండి పెడతాను, అంతవరకూ ఆగవయ్యా అంటే ఎలా ఉంటుంది..? దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా చూసుకుంటూ పంట వేయడం అవసరమే. కానీ, దాని కంటే ముందుగా తక్షణావసరం తీర్చాలి కదా! వెంటనే ఆ మనిషిని నిలబెట్టాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… కేంద్ర హామీల గురించి భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తక్షణావసరాలను వదిలేసి మాట్లాడుతున్నారు కాబట్టి..!
ఓ ప్రెస్ మీట్ లో జీవీఎల్ మాట్లాడుతూ… విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకి కేటాయించిన 11 విద్యా సంస్థల్ని నిర్ణీత గడువు కంటే ముందుగానే భాజపా సర్కారు నెరవేర్చేసిందని గొప్పగా చెప్పారు! పదేళ్ల గడువున్న వాటిని కేవలం నాలుగు సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కారుది అని మెచ్చుకున్నారు. సంస్థల ఏర్పాటుకు 2024 వరకూ సమయం ఉన్నా… కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రా త్వరగా అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల అవసరమని, దానికి కోసం విద్యా సంస్థల ఏర్పాటు త్వరగా చేయడం వల్ల ఆంధ్రా త్వరగా అభివృద్ధి జరుగుతుందనే మంచి ఉద్దేశంతోనే వీటిని నాలుగేళ్లలోనే పూర్తి చేశామన్నారు జీవీఎల్. ఇప్పటికే పది సంస్థలూ వచ్చేశాయనీ, పదకొండో సంస్థ గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా నిన్ననే కేంద్ర కేబినెట్ ఆమోదించిందనీ, దీంతో ఆఖరి కల కూడా నెరవేరిందన్నారు.
జీవీఎల్ చెప్పినట్టు విద్యా సంస్థలు కచ్చితంగా అవసరమే.. సంతోషం. గడువుకు ముందే నాలుగేళ్లలోనే నిర్మించేశారు.. ఇంకా సంతోషం. అయితే, ఆంధ్రా అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో నాలుగేళ్లలో ఇంత చొరవ చూపించారు కదా… మరి, అదే చొరవను ఇతర కీలక హామీలపై ఎందుకు చూపించలేదో జీవీఎల్ చెప్పాలి? ప్రత్యేక హోదా ఇస్తే ఇంకా అభివృద్ధి పుంజుకునేది కదా? విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, రెవెన్యూ లోటు భర్తీ, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు… ఇవన్నీ ఇస్తే ఆంధ్రా ఇంకా ఇంకా వేగవంతంగా అభివృద్ధి అయ్యేది కదా? విద్యా సంస్థలు కచ్చితంగా అవసరమే. కానీ, తక్షణం ఏపీకి ఊరటనిచ్చే హోదా లాంటి అంశాల్లో నరేంద్ర మోడీ సర్కారుకు ఎందుకు చొరవ చూపలేకపోయారో జీవీఎల్ చెప్తే బాగుంటుంది. ఈ సంస్థలు అవసరమే, వాటి కంటే ముందుగా వివిధ రకాల కేటాయింపులు ఆంధ్రాకి అత్యవసరాలు కదా! ఆంధ్రాకి తక్షణం అందాల్సిన ఆక్సిజన్ ను కేంద్రం ఇవ్వలేదు. కానీ, దీర్ఘకాలిక అభివృద్ధి గురించి భాజపా నేతలు మాట్లాడతారు. తక్షణ సాయం ఇస్తే, కాస్త నిలబడే ఓపికను ఆంధ్రాకి అందిస్తే… అభివృద్ధివైపు పరుగులు తీయడం ఎలాగో ఆంధ్రులకు తెలుసు, ఆ దిశగా నడిపించగల నాయకత్వమూ ఉంది.