నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీ భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మరోసారి మోడీ వస్తున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందనీ, దానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా భాజపాకి మంచి ఫలితాలు రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నిజానికి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాబట్టి, లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నకు జీవీఎల్ స్పందిస్తూ…. అసెంబ్లీ ఎన్నికలు అనేవి స్థానిక అంశాల ఆధారంగా జరిగినవనీ, మధ్యప్రదేశ్ లో తాము అతి తక్కువ సీట్ల తేడా ఓడిపోయామన్నారు. ఉత్తప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీల పొత్తు గురించి మాట్లాడుతూ…. ఆ రెండు పార్టీలూ కలిస్తే తప్ప భాజపాని ఎదుర్కొనే ధైర్యం లేదనేది వారు చెప్పకనే చెబుతున్నారనీ, యూపీలో ఏ ఒక్క సీటునీ కోల్పోయే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు.
ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి కలిసొచ్చే అంశం అవుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు జీవీఎల్. యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు ఇస్తున్నారనీ, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అందరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారన్నారు. ఎంత ఎక్కువమంది ప్రజలు ఓట్లేస్తే తమకు అంత లాభమన్నారు. ఎందుకంటే, ఎలాగూ ఎన్డీయే గెలుస్తోందన్న ఒక నమ్మకం దేశవ్యాప్తంగా వచ్చేసిందనీ, మోడీ మరోసారి ప్రధాని కావడం తథ్యమని అంటున్నారనీ, ఇలాంటి సమయంలో తమ ఓటు వెయ్యకపోయినా ఫర్వాలేదనే ధీమాతో ఎవ్వరూ ఉండకూడదనే మోడీ ఓటింగ్ కి రమ్మంటూ పిలుపునిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీలకే మేలు అని ఇప్పుడు అంటున్న ఈ జీవీఎల్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతంపై ఏమ్మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఓట్లు వేశారనీ, పెరిగిన ఓటింగ్ శాతం చూస్తుంటే… ప్రజలు బలమైన మార్పును కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమౌతోందన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం మొత్తం టీడీపీకి వ్యతిరేకంగానే ఉందని చెప్పారు. ఆంధ్రా ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వంపై వ్యతిరేకత… లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగితే అది మోడీకి అనుకూలతట! అంటే, ఒక్కోసారి ఒక్కో థియరీ ఉంటుందన్నమాట! ఏపీ ఎన్నికలపై జీవీఎల్ విశ్లేషణ ప్రకారం చూసుకుంటే.. కేంద్రంలో కూడా మోడీని మార్చాలని ప్రజలు బలంగా కోరుకున్నట్టే కదా? తూచ్… అలా కాదన్నమాట ఇక్కడ! ఇంతకీ ఈ మాజీ సెఫాలజిస్టు ఎన్నికల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారనేది ఆయనకే తెలియాలి!