ఆంధ్రప్రదేశ్ కు చెందిన భాజపా నేతలు గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు. ఈ మధ్య, తాను ఏపీ నేతనని చెప్పుకునే ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, సోము వీర్రాజులు గవర్నర్ ను కలిసినవారిలో ఉన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలంటూ నరసింహన్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. భోగాపురం ఎయిర్ పోర్టు టెండర్ల రద్దు, పీడీ అకౌంట్ల అవినీతి, అమరావతి బాండుల జారీలో జరిగిన అవినీతిపై వెంటనే ఎంక్వయిరీ చేయించాలన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న మరిన్ని అవినీతి భాగోతాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం, మీడియాతో జీవీఎల్ మాట్లాడారు. పర్సనల్ డిపాజిట్స్ స్కామ్ బట్టబయలు అయ్యేదాకా, కాగ్ ఆడిట్ జరిగి, అవినీతి అక్రమార్కులు ఎవరో బయటకి వచ్చే దాకా దీన్ని విడిచిపెట్టమని జీవీఎల్ స్పష్టం చేశారు! ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడితో సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారనీ, వాస్తవాలను బయటపెట్టడం లేదని ఆరోపించారు. అధికారులు, మంత్రులు… ప్రభుత్వంలోని అందరూ ఏకతాటిపై నిలబడి అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, దీన్లో ఏమాత్రం సఫలీకృతులు కాలేరన్నారు! కేంద్రంలోని అనేక శాఖలతో తాను మాట్లాడుతున్నాననీ, మోడల్ దోపిడీ చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో ఎండగడతామన్నారు. అవినీతి అంశమై సీబీఐ ఎంక్వయిరీ గతంలో అడగాననీ, అదే విషయం గవర్నర్ తో మరోసారి ప్రస్థావించానని జీవీఎల్ అన్నారు. ఇక, పార్టీపరంగా టీడీపీపై పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నామన్నారు!
కేంద్రంలో అధికారంలో ఉన్నది భాజపా సర్కారే కదా! అలాంటప్పుడు, ఏపీలో జరుగుతున్న అవినీతి గురించి ఢిల్లీ నుంచి వచ్చి మరీ, ఇక్కడ ఫిర్యాదులూ వినతులూ అని జీవీఎల్ తిరుగుతూ ఉండటం విడ్డూరంగా ఉంది! ఏపీ ప్రభుత్వం ఆ స్థాయిలో అవినీతికి పాల్పడితే… అధికారులు మొదలుకొని మంత్రులూ అందరూ ఏకతాటిపై అబద్ధాలు చెప్తున్నారని అనిపిస్తే… ఈ ఫిర్యాదులేవో కేంద్రానికి చెయ్యొచ్చు! అక్కడి నుంచే విచారణకు ఆదేశాలు తెప్పించుకోవచ్చు. జీవీఎల్ ఈ ప్రయత్నమేదో ఢిల్లీలో చేసుకోవచ్చు.
అందరూ అబద్ధాలు చెబుతున్నారని జీవీఎల్ అంటుంటే… కేంద్ర వైఖరిని పదేపదే గుర్తు చేసినట్టుగానే వినిపిస్తోంది. ఏపీ విషయంలో భాజపా నేతలు చెబుతున్నవాటిలో నిజాలేవో ప్రజలకు తెలుసు! ఆంధ్రాకి కేంద్రం చేసిన సాయం మొదలుకొని, ఆంధ్రాలో అవినీతి అంటూ చేస్తున్న ఆరోపణల్లో పస ఎంతో కూడా ప్రజలకు తెలుసు. టూ జీ స్కామ్ రేంజిలో ఏపీలో కుంభకోణం ఏదో జరిగిపోయిందని వాపోతున్న జీవీఎల్… ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క ఆరోపణకీ సరైన ఆధారాలు చూపలేకపోతున్నారు! చిన్నచిన్న ఆధారాలతోనైనా పోరాటానికి దిగితే పార్టీకీ మైలేజ్ వస్తుంది కదా?