భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. యూపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు.. అన్నీ ఇట్టే తెలిసిపోతూంటాయి. ఆయన సెఫాలజిస్ట్ కాబట్టి.. అలా తెలిసిపోతాయని.. మనం ఎంత సర్దిచెప్పుకున్నా… ఎదుటి వాళ్లను..ఆయన సంభ్రమాశ్చర్యలకు గురి చేస్తూంటారు. ఆయన చెప్పే మాటలు విని… వింతగా చూసేవాళ్లు కూడా తక్కువేమీ ఉండరు. యూపీ ఎంపీగా ఎన్నికయిన తర్వాత ఏపీపై దృష్టి పెట్టిన ఆయన.. ఏపీ ప్రభుత్వంపై అనేకానేక ఆరోపణలు చేశారు. వాటిలో 99శాతం ఆరోపణలకు సంబంధించిన సమాచారం… కేంద్రం వద్ద ఉంటుంది. ఓ అధికార పార్టీ ఎంపీగా ఆ సమాచారాన్ని సేకరించడం ఆయనకు చిటికెలో పని. కానీ ఆ చిటికె వేయరు. కానీ.. బయటకు వచ్చి చాలెంజ్‌లు చేస్తూంటారు. తాజాగా.. ఏపీ ప్రభుత్వంపై మరో ఆరోపణలు చేశారు.
ఐటీ కంపెనీల పేరుతో ఏపీలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందనేది ఆయన తాజా ఆరోపణ. ప్రోత్సాహకాల ముసుగులో షెల్ కంపెనీలు సృష్టించారని చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడు స్వయంగా చూస్తున్న ఐటీ శాఖలో కొత్తగా వచ్చిన కంపెనీలు లేవని తీర్మానించారు. ప్రోత్సాహకాలుగా కోట్లు చేతులు మారాయని.. 2014 నుంచి విడుదలైన జీవోలు చెబుతున్నాయట. ఐటీ శాఖల అక్రమాలపై కోర్టుకు వెళ్లబోతున్నామని కూడా.. ఓ అరుపు అరిశారు. ఐటీలో కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో.. వాటి వివరాలు ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమాచారం ఏదో ప్రభుత్వం దాస్తున్నట్లు ఓ ఫీలర్ మాత్రం.. జనంలోకి పంపే ప్రయత్నం చేశారు. నిజానికి సేమ్ ఇవే ఆరోపణలో.. శ్రావణ్ కుమార్ అనే లాయర్…పిటిషన్ దాఖలు చేసి.. కనీస ఆధారాలు చూపించలేక ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అయినా జీవీఎల్ బురదజల్లడానికి ఆధారాలతో పనేముందని అనుకున్నారనే.. తను ఎత్తుకున్నారు.
నిజానికి ఏపీలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయన్న లిస్ట్ కేంద్రం వద్ద కూడా ఉంది. ఈ విషయంలో కొద్ది రోజుల కిందట.. పార్లమెంట్లో వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు. ఉద్యోగాలు ఏమీ ఇవ్వలేదన్న సమాధానం వస్తుందేమోనని ఆశ పడినట్లున్నారు. ఏపీకి మూడేళ్ల కాలంలో 531 పరిశ్రమలు, లక్షా 29వేల 661కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 2.64 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర పరిశ్రమల శాఖ నేరుగా సమాధానం ఇచ్చింది. అది కేంద్రం ఇచ్చిన అధికారిక సమాచారం. కానీ ఏపీ ప్రభుత్వం మరింత అడ్వాన్స్డ్గా ఉంది. మూడున్నరేళ్లలో రూ.3.67 లక్షల కోట్లు పెట్టుబడులతో ఏపీకి 927 పరిశ్రమలు వచ్చాయి. 7.77 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలను..ఫోన్ నెంబర్లతో సహా వెబ్సైట్లో పెట్టారు. https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Industry&LOS=All ఈ లింకు లో… పూర్తి వివరాలు పెట్టింది ప్రభుత్వం.