ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతోందంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రాలో టీడీపీ పతనం మొదలైందనీ, ఆయన సొంతంగా ఎదిగే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి కేసును ఎన్.ఐ.ఎ. దర్యాప్తు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందన్నారు. దేశంలో ఎక్కడైనా విచారణ చేపట్టగలిగే అధికారం ఎన్.ఐ.ఎ.కి ఉందన్నారు. ఎన్.ఐ.ఎ. మీద చంద్రబాబుకి గౌరవం ఉన్నట్టు కాసేపు, లేనట్టు కాసేపు మాట్లాడతారన్నారు.
టీడీపీ చేస్తున్న అప్రజాస్వామ్య కార్యక్రమాల వల్ల వచ్చే ఎన్నికల్లో వచ్చే ఆ పది సీట్లూ రాకుండా పోతాయన్నారు జీవీఎల్. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పూర్తిగా విలీనమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఓ సమీకరణం కూడా చెప్పారండోయ్! వన్ ప్లస్ వన్ కలిస్తే, సాధారణంగా టు అవుతుందన్నారు జీవీఎల్. ఐదుకి ఒకటి కలిపితే ఆరు అవుతుందనీ, కానీ తెలంగాణ ఎన్నికల్లో ఫైవ్ ప్లస్ వన్ టు అయిందన్నారు!! వారికి రావాల్సిన సీట్లకంటే తగ్గాయనీ, అలాంటి సమీకరణమే ఆంధ్రాలో రాబోతోందన్నారు జీవీఎల్. ఆంధ్రాలో టీడీపీ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటామని, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. కోర్ కమిటీ మీటింగులో దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
ఆంధ్రాలో భాజపా వాస్తవ పరిస్థితి ఏంటనేది ఆ పార్టీ నేతలకే అవగాహన లేనట్టుగా కనిపిస్తోంది..! ఆంధ్రాలో ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారో అనేది ఎన్నికలు పూర్తయితే తప్ప జీవీఎల్ కి అర్థం కాదేమో..! మోడీ సర్కారు ఆంధ్రాపై ఎంతటి కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందో అందరికీ తెలిసిందే. విభజన చట్టంలో అంశాలు, మోడీ ఇచ్చిన హామీలు.. ఇవేవీ అమలు చేయని పరిస్థితి ఉంది. వీటిపై జీవీఎల్ మాట్లాడరు. ఆంధ్రాలో అనుసరించాల్సిన కార్యాచరణను కోర్ కమిటీలో ఖరారు చేశామంటున్నారు. అంతేగానీ, ఆంధ్రాకు ఇచ్చిన హామీలను అమలు చేశామా లేదా అనే చర్చ ఆ కోర్ కమిటీలో చేయరు. సరే, జీవీఎల్ లాంటి వలస నేతలకు ఆంధ్రాపై అభిమానం లాంటివి ఉండొకపోవచ్చు, కనీసం ఇక్కడి నుంచి వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ లాంటివారు కూడా ఆ భేటీ ఏపీ హక్కుల గురించి మాట్లాడరా..? ఏపీలో ఎవరిపై ఎందుకు వ్యతిరేకత వ్యక్తమౌతోందో విశ్లేషించుకోరా..?