తెలుగు రాష్ట్రాల్లో రోజుకో ప్రెస్ మీట్ పెట్టమంటూ ఎసైన్ చేశారేమోగానీ…. ఈ మధ్య అదే పనిలో ఉంటున్నారు భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. నిన్ననే, ఆంధ్రాలో తుఫాను బాధితులకు సాయం చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు చేశారు! ఇవాళ్ల.. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై విమర్శల కార్యక్రమం పెట్టుకున్నారు. భైంసాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు.
చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ వ్యవహరాలు బయటకి వచ్చాయనీ, పన్నులు ఎగ్గొట్టాయని తేలిందని జీవీఎల్ అన్నారు! మరో సన్నిహితుడు రేవంత్ రెడ్డి విషయాలు కూడా బయటకి వచ్చాయన్నారు! ఐటీ ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆయనేదో హీరోగా బిల్డప్ ఇస్తూ వచ్చారన్నారు. కె.ఎల్.ఎస్.ఆర్. సంస్థ ఎవరిదీ, ఆయన బావ మరిదికి చెందిన సాయి మౌర్యా ఎస్టేట్ కి చెందిన రూ. 11 కోట్ల ధనాన్ని డిక్లెర్ చేయలేదని రేవంతే స్వయంగా ఒప్పుకున్నట్టు తెలిసిందని జీవీఎల్ అన్నారు! వీటిపై ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఇవన్నీ తెలిసే రేవంత్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారేమో అని తాను భావిస్తున్నా అని ఎద్దేవా చేశారు.
ఇలా దందాలు చేసేవారికి కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. రాహుల్ గాంధీపైన కూడా ఒకరకంగా భూ కబ్జాల ఆరోపణలున్నాయన్నారు! టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ… తాను ఉత్తముడనీ, దేశం కోసం పోరాటం చేశానని ఉత్తమ్ చెప్పుకుంటారన్నారు జీవీఎల్. రేవంత్ లాంటి వారిని వెనకేసుకొస్తున్నందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల వారిని కించపరుస్తూ ఈ మధ్యనే నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యలు చేశారనీ, ఇలాంటి సందర్బంలో రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారన్నారు జీవీఎల్! అంతే… ఇవాల్టి ఎసైన్మెంట్ అయిపోయినట్టే..!
జీవీఎల్ వ్యాఖ్యల వల్ల భాజపాకి నష్టమే తప్ప లాభం ఉండదని పదేపదే రుజువౌతున్నా… వాస్తవం ఇంకా ఢిల్లీ పెద్దలకు అర్థమౌతున్నట్టు లేదు. దందాలు చేసేవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఎక్కువ అంటూ విమర్శించి.. భాజపాలో ఉన్న గాలి సోదరుల గురించి వారే గుర్తు చేసినట్టయింది..! కర్ణాటకలో వారు చేసిన దందాలు చిన్నవా..? దక్షిణాది ప్రాంతాల వారిని సిద్ధు కించపరచారంటూ… సెంటిమెంట్ ని రెచ్చగొడ్డం ద్వారా జీవీఎల్ ద్వారా భాజపా ప్రోత్సహిస్తున్నదేంటీ… ప్రాంతీయ వాదమా..? మరి, దక్షిణాది రాష్ట్రాల పట్ల భాజపా అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఏమంటారు..? ఇలాంటివన్నీ జీవీఎల్ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి.