సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… యథావిధిగా అధికార పార్టీపై విమర్శలు చేశారు. ఐటీ సోదాలకు సీఎం రమేష్ బెంబేలెత్తిపోతున్నారనీ, తెలుగుదేశం నాయకులు సక్రమంగా పన్నులు కడితే ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు కదా అని పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్ పిలిస్తే చాలు… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జీవీఎల్ జోస్యం చెప్పారు.
ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు తరచూ పోల్చుకుంటారనీ, దాన్లో తప్పులేదనీ, కానీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువుతో ఉండే సౌరాష్ట్ర ప్రాంతాన్ని అభివృద్ది చేశారన్నారు. ఆ ప్రాంతం దాదాపుగా రాయలసీమలానే ఉంటుందన్నారు. అక్కడ నీటి వసతులు అస్సలు లేవనీ, ప్రతీ గ్రామానికి నర్మదా జలాలను మోడీ తీసుకెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు మాత్రమే చేశారనీ, వాస్తవంలో ఈ ప్రాంతానికి చంద్రబాబు చేసిందేం లేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ కూడా రాజకీయాంశం అయిపోయిందనీ, కానీ రాష్ట్రం నుంచి సమగ్ర సమాచారం ఇవ్వకపోవడం వల్లనే పరిస్థితి ఇలా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడి ఉందనీ, కానీ అన్నింటినీ రాజకీయం చేసే దృక్పథంతో టీడీపీ ఉందని ఆరోపించారు.
కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని జీవీఎల్ చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది! అంటే, కేంద్రం సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి రాష్ట్రమే రెడీగా లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న తీరు మరీ విడ్డూరం! ఇంకోటి, ఆంధ్రాలో టీడీపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదట. సరే, భాజపా గెలిచే సీట్లేంటో జీవీఎల్ చెప్పగలరా..? అదీ వద్దు, ఏపీలో భాజపాకి డిపాజిట్లు దక్కేస్థానాలు ఎన్నుంటాయో అదైనా చెప్పగలరా..? రాయలసీమ గురించి, అక్కడి అభివృద్ధి గురించి జీవీఎల్ మాట్లాడటం మరీ హాస్యాస్పదం! ఎందుకంటే, ఇక్కడి సమస్యలపై ఆయన ఉన్న అవగాహనేదీ..? రాయలసీమలో చాలా ప్రాంతాలకు ఈ ప్రభుత్వ హయాంలో నీళ్లొచ్చాయి. కియా మోటార్స్ వంటి పెద్ద సంస్థలు వచ్చాయి.
అన్నింటినీ రాజకీయం చేయాలని టీడీపీ చూస్తోందని జీవీఎల్ ఆరోపిస్తున్నారు కదా… ఇంతకీ, ఆయన ఏపీకి వచ్చి చేస్తున్నదేంటి..? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారా..? భాజపా పార్టీ విస్తరణలో భాగంగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా..? భాజపా ఎంపీగా ఆంధ్రాలో ఆయన చేస్తున్న పనేంటి..? ప్రతీరోజూ మైకులు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని రాజకీయం తప్ప, ఇంకేదైనా అంటారా..?