గడచిన నాలుగేళ్లతో పోల్చుకుంటే ప్రధానమంత్రి మోడీ పాపులారిటీ గణనీయంగా పడిపోయిందంటూ వరుసగా కొన్ని సర్వేలు బయటకి వస్తున్నాయి. 2014కి ముందు యూపీయే పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎన్డీయే పరిస్థితి కూడా అలానే ఉందనే విశ్లేషణలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఒక టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు కాకుండా, ఆయన అనుకున్న అంశాలను సమాధానాలుగా చెప్పే ప్రయత్నం చేశారనే చెప్పొచ్చు!
కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రధానమంత్రికీ లేనంత రేటింగ్ నరేంద్ర మోడీకి ఉందని జీవీఎల్ అన్నారు! అది తగ్గిపోయిందని మీరు అనుకుంటే, అంకెల్నీ సంఖ్యల్నీ సరిగా చూడటం లేదని అర్థం అని చెప్పారు. ప్రధాని మోడీకి ఈరోజున ఉన్న పాపులారిటీ 2014 కంటే పెరిగిందన్నారు. ఎందుకంటే, ఆరోజున ఆయన పరిపాలన గురించి ప్రజల్లో చాలామందికి తెలీదనీ, ఈరోజున దేశమంతా చూసింది కాబట్టి… వచ్చే ఎన్నికల్లో 2014లో వచ్చిన విజయం కంటే, ఇంకా ఎక్కువ స్థాయిలో విజయం సాధిస్తామన్న ధీమా తమకు ఉందన్నారు. నల్లధనం నిర్మూలన, పెట్రోల్ ధరల పెరుగుదల వంటి అంశాల్లో వైఫల్యమే కదా అని జీవీఎల్ ని అడిగితే… దాని గురించి మాట్లాడకుండా, కాసేపు నీళ్లు నమిలి, నెగెటివ్ చూసుకునేవారికి, ప్రతిపక్షాల వారికీ కేవలం నెగెటివ్ మాత్రమే కనిపిస్తుందన్నారు. అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారు.. గ్యాస్ కనెక్షన్లు, జన్ ధన్ అకౌంట్లు, కరెంటు కనెక్షన్లు, హైవేల నిర్మాణం, మంత్రులపై అవినీతి ఆరోపణలు లేవు… ఏదేదో చెప్పారు.
పెట్రోల్ ధరల నియంత్రణ సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానం లేదు. పెట్రో మంటలపై జనం ఆగ్రహిస్తుంటే పట్టదా..? నల్లధనం గురించి అడిగితే దానికీ సమాధానం చెప్పలేదు. ప్రధానిపై అసంతృప్తి శాతం పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయని చెబితే… అంకెలు సరిగా చూడాలని అంటారు. అంటే, ఇలాంటి సర్వేలు వస్తున్నాయనీ జాతీయ స్థాయిలో చర్చనీయం అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం జీవీఎల్ చేసినట్టు లేదు. తాను అనుకున్నది తాను చెప్పెయ్యాలి అంతే. మొత్తానికి, జీవీఎల్ గందరగోళానికి గురయ్యారని చెప్పొచ్చు. ఒక్కమాట మాత్రం కరెక్ట్ గా చెప్పారండోయ్..! 2014కు ముందు మోడీ పాలనను ప్రజలు చూడలేదనీ అదేంటో తెలీదనీ, ఇప్పుడు నాలుగేళ్లపాటు చూశారని చెప్పారు..!