ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే లేనట్టు, పాలన అంతా భాజపా వల్లనే జరుగుతున్నట్టు మరోసారి మాట్లాడారు భాజపా ఎంపీ జవీఎల్ నర్సింహారావు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయమై కడపలో టీడీపీ నేతలు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై జీవీఎల్ స్పందించారు. కడప ఉక్కు పరిశ్రమ ఆలస్యానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరే అనే స్టాండర్డ్ వాదన వినిపించారు. సరైన విషయ పరిజ్ఞానం లేకుండా నేతలు దీక్షలు చేయకూడదని హితవు పలికారు! కడప జిల్లా అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలనీ, మెకాన్ సంస్థకు సహకరించాలని జీవీఎల్ అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 8 గనులుంటే వాటిలో 7 పనిచేసే పరిస్థితుల్లో లేవన్నారు. ఒకటి మాత్రమే పని చేస్తోందన్నారు. సరైన సమాచారం లేకుండా వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారనీ, ఆ తరువాత ముడి ఖనిజం ఎక్కడి నుంచి వస్తుందని జీవీఎల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్నట్టుగా కేంద్రంలో అడ్డగోలు నిర్ణయాలు ఉండవనీ, ఒక పద్ధతి ప్రకారం తీసుకునే నిర్ణయాల్లో హేతుబద్ధత ఉంటుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి ఎంత వస్తుందీ, ఉన్న నిల్వలు ఎంత అనే సమాచారం ఇవ్వకుండా కేంద్రాన్ని నిందించడమేంటని విమర్శించారు. ఈ సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వాల్సిన కనీస బాధ్యత రాష్ట్రానికి ఉంటుందనీ, కాబట్టి ఇలాంటి దీక్షలు చేయడం వల్ల వారి పరువే పోతుందనీ, అందుకే వెంటనే దీక్షలు విరమించుకోవడం మంచిదని సూచించారు.
కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాకపోవడానికి కారణం కూడా ఏపీ సర్కారు సమాచారం ఇవ్వకపోవడమేనట! ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వకపోవడానికి కూడా కారణం ఏపీ సమాచారం ఇవ్వకపోవడమే. రాష్ట్రానికి నిధులు రాకలో ఆలస్యమౌతుండటానికి కారణమూ.. ఏపీ సమాచారం ఇవ్వకపోవడమే. అన్నింటికీ రాష్ట్రమే కారణమట. ఇదే వాదనను పదేపదే వినిపించడమే జీవీఎల్ డ్యూటీలా ఉంది. మొన్నటికి మొన్న.. సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తూ.. ఉక్కు కర్మాగారం అసాధ్యమని చెప్పి, ఫైల్ మూసేయడానికి కేంద్రం ప్రయత్నించలేదా..? దీంతో రాష్ట్రంలో ఒక్కసారి గుప్పున విమర్శలు వెల్లువెత్తేసరికి.. అబ్బే అదేం లేదూ, కట్టుబడి ఉన్నాం, ఫ్యాక్టరీ కట్టించి తీరతామని మాట మార్చలేదా..? దీనిపై జీవీఎల్ మాట్లాడరేం!
సరే, జీవీఎల్ చెప్పిన లాజిక్కే… సరైన సమాచారం లేకుండా కోట్లకు కోట్లు ఎలా పెట్టుబడులు పెట్టాలన్నారు కదా! సమాచారం లేకుండా టీడీపీ నేతలు దీక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. మరి, రాష్ట్రంలో ఖనిజ రిజర్వులు పరిపూర్ణంగా ఉన్నాయా లేవా అనే పరిపూర్ణ సమాచారం చూసుకోకుండా… కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి మోడీ శంకుస్థాపన చేసేశాస్తారని ఏపీ నేతలు ఏ ప్రాతిపదికన ప్రకటనలు చేస్తున్నట్టు..? ఫ్యాక్టరీ కేంద్రం ఇచ్చి తీరుతుందని కన్నా లక్ష్మీ నారాయణ ఎలా ఢంకా బజాయిస్తారు..? అంటే, కడప ప్రాంతంలోని ఐరన్ ఓర్ నిక్షేపాలకు సంబంధించిన సమాచారం వారి దగ్గర ఉన్నట్టా..? ఉంటే వారి నుంచే తీసుకోవచ్చుగా.. రాష్ట్రాన్ని ఎందుకు అడగడం..? ఇంతకీ ఈ అంశంపై సరైన విషయ పరిజ్ఞానం భాజపా నేతలకు భాజపా నేతలకు ఉందా..? లేకుండానే కర్మాగారం తెచ్చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారా..?