భాజపా అధ్యక్షుడు అమిత్ షాని ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి గాలికి వదిలేశారనీ, తెలుగుదేశం బలోపేతానికి మాత్రమే కృషి చేశారని భాజపా నేతలు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమస్యలను తీర్చేందుకు తాను ఉన్నానని అమిత్ షా హామీ ఇచ్చారని కన్నా తెలిపారు.
ఈ భేటీ అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ… ‘ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేద్దామని అమిత్ షా చెప్పారు. వారు (ఏపీ సీఎం) బాధ్యత వదిలేసినా ప్రజల పట్ల మనకు బాధ్యత ఉన్నది. ప్రజల కోసం మనం అనుకున్న పనులన్నీ చేద్దాం అని ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట వినగానే ఆంధ్రా బిడ్డగా నేను చాలా గర్వించాను, చాలా ఆనందపడ్డాను. నా జాతీయ అధ్యక్షుడికి, నా రాష్ట్రం పట్ల ఇంతటి ప్రత్యేక అభిమానం ఉన్నదని సంతోషించాను’ అని జీవీఎల్ చెప్పడం జరిగింది..! ఏదో సినిమాలో నటి శ్రీలక్ష్మి ‘బాబూ.. చిట్టీ ఏమన్నావ్..’ అనే సీన్ గుర్తొచ్చేస్తోంది కదా!
ఆంధ్రా తన సొంత రాష్ట్రమని జీవీఎల్ కి ఇన్నాళ్లకు గుర్తొచ్చింది… ఏపీలో పండుగ చేసుకోవాల్సిందే. అమిత్ షా ఆంధ్రా గురించి ఆలోచిస్తున్నారట.. పండుగను మరో రోజు ఎక్స్ టెండ్ చేసుకోవాలి. అమిత్ షా ఆంధ్రా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని తెలిసేసరికి.. జీవీఎల్ కి ఆయనలోని ‘ఆంధ్రా బిడ్డతనం’ తొలిసారి తొంగి చూసిన క్షణమిది..! నా అధ్యక్షుడు, నా రాష్ట్రంపై ఇంత అభిమానం చూపిస్తున్నారా.. చాలు ఈ జన్మకి అన్నంత రేంజిలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు జీవీఎల్.
ఆంధ్రాతో బీరకాయ పీచు సంబంధం వెతుక్కుంటున్న ఈ జీవీఎల్ కి ఏపీ సమస్యలు ఏవైనా తెలుసా..? ఆయన ఆంధ్రాలో రాజకీయాలు చేసిందెప్పుడు..?
ఎక్కడో మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర, మరెక్కడో భాజపా స్ట్రాటజీ టీంలో సభ్యుడిగా పనిచేస్తూ, ఎన్నికల సర్వేలు చేస్తూ… ‘మోడీ ప్రధాని అభ్యర్థి అవుతారు’ అనే ఒక ముందుచూపు మాట పడెయ్యడమూ, మిడతంబొట్లు జాతకం మాదిరిగా గాల్లో జరిపిన ఆ కాల్పులు ఎక్కడో తగిలేయడంతో.. ఇవాళ్ల ఎంపీ అయ్యారు. ఏపీకి చెందిన నేతగా స్వీయ ప్రకటన చేసుకుంటే సరిపోతుందా, ఇక్కడి సమస్య గురించి ఏనాడైనా స్పందించిన చరిత్ర ఉందా లేదా అని ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా! అమిత్ షా ఏదో అనగానే తెలుగు బిడ్డగా తనకు ఏదో అయిపోయిందని ఇవాళ్ల పులకిస్తున్నారే.. నాలుగైదు నెలల కిందటి వరకూ ఈ తెలుగు బిడ్డ ఏమయ్యారు..? ఎక్కడున్నారు..? ఆంధ్రాలో కేరాఫ్ కనిపించలేదే..?