బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు.. ఆ పార్టీ హైకమాండ్ చాలా పెద్ద బాధ్యతే ఇచ్చినట్లుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తన వాగ్ధాటితో తిప్పికొట్టాలని.. ఆయనకు ఏపీ బాధ్యతలు ఇచ్చినట్లున్నారు. ఢిల్లీలో ఉన్నా.. విజయవాడ వచ్చినా.. చంద్రబాబు రోజూ చేసే విమర్శలపై.. కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన మాటల్లో కామన్ గా వచ్చే పదం మాత్రం.. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారనే విషయమే. తాను చెప్పేవి మాత్రమే నిజాలన్నట్లుగా ఆయన చెబుతూ ఉంటారు. కానీ ఆయన కూడా ఎప్పుడూ ఒకే మాట చెప్పరు.. ఎప్పటికప్పుడు మాట మార్చేస్తూ ఉంటారు. అయినా తనవే నిజాలంటూ ఉంటారు.
గుజరాత్ లో నిర్మిస్తున్న ధొలెరా సిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ అయింది. అమరావతికి నిదులు ఇవ్వకుండా.. ప్రధానమంత్రి మోదీ.. స్వరాష్ట్రంలోని ధొలెరాకు నిధులను ప్రవహింప చేస్తున్నార్నన అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయంలో అసలు నిజాలేమిటో చెప్పడానికి జీవీఎల్ నరసింహారావు కిందా మీద పడుతున్నారు. ఓ రోజు ఢిల్లీలో మీటింగ్ పెట్టి… కేంద్రం రూ. 2,500 కోట్లు మాత్రమే ధొలెరాకు ఇస్తోందన్నారు. అలాంటివి ఏపీకి మూడు వస్తున్నాయని ముచ్చట్లాడారు. ఈ రోజు విజయవాడకు వచ్చి భిన్నమైన వెర్షన్ వినిపించారు. గుజరాత్ లో డొలెరా సిటీ, పటేల్ విగ్రహం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. డొలేరా ప్రాజెక్టుకు కేంద్రం రూ.1,293 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. మరి ఢిల్లీలో చెప్పిన దానికి, విజయవాడలో చెప్పినదానికి ఎందుకంత తేడానో మరి..? ఇంత తేడా పెట్టుకుని నిజం అని చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు..?.
వల్లభాయ్ పటేల్ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించే బాండ్లకు.. పన్ను మినహాయింపు ఇచ్చిన కేంద్రం…అమరావతి బాండ్లకు మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపైనా .. తనకిష్టం వచ్చినట్లు నిజాలు చెప్పుకున్నారు.. జీవీఎల్. పటేల్ విగ్రహం కోసం కేంద్రం ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు.కానీ బాండ్లకు పన్ను మినహాయింపు గురించి చెప్పలేదు. ఇక నిధుల ఖర్చుపైనా తన నిజాలు తాను చెప్పారు. వెయ్యి కోట్లు ఇస్తే రూ. 230 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. మరి ధొలెరా, పటేల్ విగ్రహాలకు కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు వచ్చాయా..? అన్న దానిలో ఉన్న నిజాలపై ఆయన మాట్లాడలేదు.
తన వాక్చాతుర్యంతో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. తాను చెప్పేవి మాత్రమే నిజాలని నమ్మించడానికి జీవీఎల్ నరసింహారావు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవేమీ… దూరదర్శన్ లో వచ్చే ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కాదుగా.. తాను చెప్పాల్సింది చెప్పి.. సైలెంట్ గా ఉండటానికి ప్రజల ముందు ఇప్పుడు పూర్తి సమాచారం ఉంది. భిన్నంగా అంటే.. అధికారిక లెక్కలను విడుదల చేసి నిజాలు నిరూపించాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ప్రయోజనం ఏముంటుంది..?