జీవీఎల్ నర్సింహారావు… ఆయన కూడా ఎంపీ. ఆంధ్రా నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా, సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వంతు మాట సాయం చేస్తున్నానని అప్పుడప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం, కేంద్రాన్ని నిర్ద్వంద్వంగా వెనకేసుకుని రావడం మాత్రమే ఆయన పని అనే విమర్శలున్నాయి! టీడీపీ ఎంపీల తీరు బాలేదంటూ ఆయన ఈరోజు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం సభ్యులు పార్లమెంటు స్థాయిని పూర్తిగా దిగజార్చే విధంగా నాటకాలాడుతున్నారనీ, రోజుకో వేషం వేస్తూ పార్లమెంటును అభాసుపాలు చేస్తున్నారంటూ ఢిల్లీలో జీవీఎల్ విమర్శించారు. కేవలం ప్రచారం కోసమే పార్లమెంటును టీడీపీ వినియోగించుకుంటూ ఉండటం సరికాదన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారనీ, కేవలం రాజకీయాలు చేయడం మాత్రమే టీడీపీ పనిగా ఉందని ఎద్దేవా చేశారు! టీడీపీ ఎంపీలపై ఆయన ఇంతకుముందే ఓ ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో తాను మాట్లాడుతుంటే.. టీడీపీ ఎంపీలు బెదిరించారనీ, దానికి సంబంధించిన వీడియో ఆధారాలతో రాజ్యసభ అధికారులకు ఇచ్చారు.
జీవీఎల్ వ్యాఖ్యల్లో హాస్యాస్పదంగా అనిపిస్తున్నవి ఏంటంటే… కేవలం ప్రచారం కోసమే సభా సమయాన్ని టీడీపీ వాడుకుంటోందని చెప్పడం! నిజానికి, ఏపీతో సహా దేశంలోని ప్రధానమైన సమస్యల గురించి భాజపా సభ్యులు ఎక్కడ మాట్లాడుతున్నారు..? వారు సాధించిన విజయాలే కదా చెప్పుకునేది. ఇక, ఆంధ్రా విషయంలో అన్నీ చేసేశామని, విభజన హామీల్లో 85 శాతం పూర్తి చేశామని చెప్పుకోవడం ప్రచారం కాదా? రైల్వేజోన్ కి సిద్ధం, కడప స్టీల్ ప్లాంటుకి సిద్ధం, పోర్టుకి సిద్ధం.. ఏవీ కార్యరూపం దాల్చకపోయినా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవడమూ, అద్రుశ్య అభివ్రుద్ధి చేశామని చెప్పుకోవడమూ ప్రచారమే కదా!
పార్లమెంటు స్థాయిని టీడీపీ ఎంపీలు దిగజారుస్తున్నారని జీవీఎల్ చెప్పడమూ హాస్యాస్పదంగానే ఉంది. గడచిన పార్లమెంటు సమావేశాల్లో… అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగనీయకుండా చేయడంలో దిగజారుడుతనం కనిపించం లేదా..? కేవలం, రాజకీయ లబ్ధి ఉండదన్న ఒకే ఒక్క కారణంతో ఆంధ్రాకు సంబంధించిన నిధుల విడుదల, ప్రాజెక్టుల కేటాయింపులను నిర్లక్ష్యం చేస్తుండటం దిగజారుడుతనం అనిపించడం లేదా..? రాష్ట్రంలో పరిపాలన వదిలేసి, రాజకీయాలు చేస్తున్నారనీ జీవీఎల్ విమర్శించారు. సరే, మరీ.. రాష్ట్రంలో విషయంలో కేంద్రం బాధ్యతాయుతంగా పాలిస్తోందా..? రాష్ట్రాలపై కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుంది కదా! ఆంధ్రాపై నిజంగానే అంత బాధ్యత ఉంటే… ఈ మధ్య విడతలవారీగా సుప్రీం కోర్టులో సమర్పిస్తున్న అఫిడవిట్లను ఏమంటారు..?
ఆంధ్రాలో భాజపా ఎదగాలని అనుకుంటోంది. కానీ, జీవీఎల్ లాంటివారికి వకాల్తా ఇవ్వడం వల్ల… ఏపీకి భాజపా చేసిన గాయాలు పదేపదే గుర్తొచ్చే విధంగానే పరిస్థితి కనిపిస్తోంది. భాజపాపై మరింత వ్యతిరేకత పెంచే విధంగా మాత్రమే ఆయన చర్యలు ఉంటున్నాయి. మరి, ఈ కోణాన్ని భాజపా గమనిస్తోందో లేదో తెలీదు! టీడీపీ ఎంపీల తీరు బాగుందో లేదో కాసేపు పక్కనపెట్టి… తన తీరు వల్ల ఆంధ్రాలో భాజపాకి జరుగుతున్న మేలు ఏపాటిదో జీవీఎల్ విశ్లేషించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.