కేంద్రంలోని మోడీ సర్కారు సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంది. కశ్మీరులో 370 రద్దుగానీ, ట్రిపుల్ తలాక్ బిల్లుగానీ ఇలాంటివాటిపై ప్రజల నుంచి కూడా మంచి మద్దతే వచ్చింది. అయితే, ఇప్పుడీ సీఏఏ మీద దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం భాజపాకి అలవాటే. వారి నిర్ణయాలకు ప్రజలు హర్షిస్తే భాజపా విజయంగా చాటుకుంటారు. విమర్శించి, ఇదిగో ఇప్పట్లా నిరసనలు తెలిపితే… ఇది కాంగ్రెస్ చేస్తున్న పని అంటూ విమర్శల దాడి చేస్తున్నారు. ఎంపీ జీవీఎల్ నర్సింహారావు హైదరాబాద్లో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. సీఏఏ గురించి మాట్లాడుతూ, మధ్యలో కాంగ్రెస్, ఆ మధ్యలో హైదరాబాద్లో మత రాజకీయాలు అంటూ తనదైన ధోరణిలో విశ్లేషించుకుంటూ పోయారు.
కాంగ్రెస్ మత రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని జీవీఎల్ ఆరోపించారు! నిజమైన సెక్యులర్ విధానాలు భాజపాకి మాత్రమే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సీఏఏ మీద నిరసనలు వ్యక్తం కావడం లేదనీ, అంటే ఇతర రాష్ట్రాల్లో వ్యక్తమౌతున్న నిరసనల వెనక కాంగ్రెస్ ఉందని విశ్లేషించారు! సీఏఏ మీద తప్పుడు రాజకీయాలు కాంగ్రెస్ చేస్తోందనీ, అందుకే ప్రజలకు వాస్తవాలు వివరించాలనే వచ్చామన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశానికి మరోసారి స్వతంత్రం వచ్చినట్టు అయిందన్నారు. ఇదే కార్యక్రమంలో లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఆయనేమంటారంటే… అసదుద్దీన్ ఒవైసీతో జాతీయ గీతం పాడించిన ఘనత ఒక్క నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు!
మత రాజకీయాలకు అడ్డాగా హైదరాబాద్ మారిందా? దాని వెనక కాంగ్రెస్ ప్రోత్సాహం ఉందా..? ఇలాంటి విమర్శలకు ఒక్కటైనా ఆధారాన్ని జీవీఎల్ చూపించి ఉంటే కొంతైనా నమ్మశక్యంగా ఉంటుంది. అయినా, సీఏఏ మీద ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేస్తామని భేటీ అయిన ఈ మేధావుల్లో ఒకరైన జీవీఎల్… కల్పించిన అవగాహన ఏదీ? కశ్మీర్, ట్రిపుల్ తలాక్ లాంటిదే ఇది కూడా.. అని ప్రజలు నమ్మేలా చేసే విధంగా విశ్లేషణాత్మకంగా మాట్లాడారా? సీఏఏ పేరుతో మత రాజకీయాలంటూ కాంగ్రెస్ మీద విమర్శలకు పరిమితం కావడమే ఈ అవగాహనా సదస్సు ముఖ్యోద్దేశమా? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, పోలీసు కాల్పుల్లో బలైన పరిస్థితి కనిపిస్తుంటే… ఆ నిరసనల వెనకున్న అసలు కారణం వదిలేసి, ఇవి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవే, జనాల్ని ఆ పార్టీయే పంపిస్తోందీ… ఇది కాదుగా మేధావులుగా జీవీఎల్ లాంటివాళ్లు చెయ్యాల్సిన విశ్లేషణ? సీఏఏ ఎందుకు మంచిదో, ఎలా మంచిదో వివరించండి. నిరసనలు ఆపే ప్రయత్నం చెయ్యండి. కనీసం కొద్దిరోజులపాటైనా రాజకీయం ఆపండి. ఆ తరువాత, ఈ ఘనత మాదే అని ఢంకా బజాయించుకోవచ్చు.