ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపే గుంటూరు రాబోతున్నారు. ఈ సభకు ఏం చేసైనా సరే, జనాన్ని రప్పించాలని భాజపా భావిస్తోంది. జన సమీకరణకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నవారి సాయాన్ని కూడా భాజపా తీసుకుంటోందట! వీలైతే, ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని కథనాలు వినిపిస్తున్నాయి. గతవారంలో పలాస వచ్చిన అమిత్ షాని చూసేందుకు జనాలు రాలేదు! ఏపీ నేతలకు బాగానే క్లాస్ పడిందనీ, దీంతో జన సమీకరణలో వీరు తలమునకలౌతున్నారని తెలుస్తోంది. అయితే, ప్రధాని సభకు జనం వచ్చి విజయం సాధించినా, జనం రాక తుస్సుమన్నా కూడా దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ఒక వాదనను ఇప్పటికే బీజేపీ రెడీ చేసేసుకుంది.
ప్రధాని సభ గురించి భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ… ప్రతికూల సమయాల్లోనే కమలం వికసించిందన్నారు! ప్రజా సంఘాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ప్రతిఘటనను పార్టీ ఎదుగుదలకు అవకాశం అవుతుందన్నారు. ప్రధాని సభపై వ్యక్తమౌతున్న వ్యతిరేకత ప్రజల నుంచి వస్తున్నది కాదనీ, మీడియాకి కూడా కొన్ని ఇబ్బందులున్నాయనీ, తెలుగుదేశం చెప్పిన ప్రచారమే మీడియాలో వస్తోందన్నారు. ప్రజల్లో తమపై ఎక్కడా వ్యతిరేకత లేదన్నారు. ప్రధాని సభ తరువాత టీడీపీకి భంగపాటు తప్పదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము సభ పెడుతున్నామనీ, ఈ రకంగా అడ్డుకునేందుకు దుర్మార్గంగా తాము ఎప్పుడూ వ్యవహరించడం లేదని జీవీఎల్ అన్నారు. ఇక్కడో హెచ్చరిక కూడా చేశారండోయ్… ‘ఒకవేళ వాళ్లు ప్రతిఘటిస్తే… మా నుంచి కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేం దేశవ్యాప్తంగా 11 కోట్లమంది సభ్యులున్న పార్టీ, అందరూ ఒక కేక వేస్తే… తెలుగుదేశం పార్టీ చెవులు మూసుకోవాల్సి వస్తుంది’ అన్నారు జీవీఎల్.
గుంటూరులో ప్రధానమంత్రి సభ సక్సెస్ అయిందనుకోండి… టీడీపీ మీద వ్యతిరేకతకు ఇది చిహ్నమంటారు కమలనాథులు! ఒకవేళ, జనం రాలేదే అనుకోండి… అది టీడీపీ దుశ్చర్య, ప్రజాస్వామ్య విరుద్ధ చర్య, ప్రజలను అడ్డుకున్నారు అంటూ విమర్శలు చేస్తారు. జీవీఎల్ మాటల్లో ఈ రెండు మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే… 11 కోట్ల మంది సభ్యులున్నారు, అరిస్తే టీడీపీ చెవులు మూసుకుంటారని అనడం! అంటే, ఒక జాతీయ పార్టీ ప్రతాపమంతా ప్రాంతీయ పార్టీ మీద చూపించడానికేనా..? ఒక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి పనికి రాలేదా..? ఇంకా దారుణమైన అంశం ఏంటంటే… తానూ కేరాఫ్ ఆంధ్రా అని చెప్పుకునే జీవీఎల్, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఇలా మాట్లాడుతూ ఉండటం.