ఆంధ్రా సమస్యలను ప్రధాని ముందు సీఎం చంద్రబాబు మరోసారి ఏకరువు పెట్టారు. గతంలో పార్లమెంటులో ఇచ్చిన వాగ్దానాలు, భాజపా హామీలు, గడచిన నాలుగేళ్లుగా కేంద్రం చూపిన నిర్లక్ష్య వైఖరిపై నీతీ ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రస్థావించారు. దీన్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులు, చెల్లింపులను కూడా సీఎం ప్రస్థావించారు. అయితే, వీటిపై అయితే ఆయా మంత్రిత్వ శాఖల నుంచి జవాబు లేదా ఖండన లేదా విమర్శ రావాలి. లేదంటే, ప్రధాని స్వయంగా స్పందించాలి. అంతేగానీ… ఎంపీ జీవీఎల్ నర్సింహరావు స్పందించడం హాస్యాస్పదంగా ఉంది. శాఖలవారీగా ఏపీకి కేంద్రం ఏం చేసిందీ, ఏపీ ఇప్పుడు ఎలా ప్రయత్నించాలనేది కూడా ఈయనే చెప్పేస్తుంటే ఎలా..? అంటే, ఏపీ సమస్యలపై పెద్దలు మాట్లాడరా..? వారికి బాధ్యత లేదా..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని జీవీఎల్ విమర్శించారు. మీడియాలో ప్రచారార్భాటం కోసమే నీతీ ఆయోగ్ లో చంద్రబాబు మాట్లాడారని ఎద్దేవా చేశారు. నేడు నీతీ ఆయోగ్ లో ప్రస్థావించిన అంశాలపై గత రెండు నెలలుగా ఏం ప్రయత్నం చేశారన్నారు! స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేస్తే, దాని ద్వారా నిధులిస్తామనీ, ప్యాకేజీ రూపకల్పన జరుగుతోందని ఆర్థికమంత్రి చెప్పారన్నారు. కానీ, ఆ దిశగా ఏపీ సర్కారు ప్రయత్నమే లేదన్నారు జీవీఎల్. అయితే… ఇక్కడ జీవీఎల్ కన్వీయంట్ గా వదిలేసిన పాయింట్ ఏంటంటే… ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేసి రెండేళ్ల అయితే, రెండు నెలల కిందటి వరకూ కేంద్రం ఏం చేసిందీ అనేది చెప్పరు..! ఇక, హోదాకి బదులుగా ప్యాకేజీ ఇచ్చినప్పుడు అద్భుతం అని చంద్రబాబు మెచ్చుకున్నారంటూ కొన్ని వార్తలు క్లిప్పింగులు జీవీఎల్ చూపించారు. ఇక్కడ జీవీఎల్ కి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే.. ప్యాకేజీ ఇచ్చామని ప్రకటించడానికీ, ప్రకటించిన నిధులు ఇవ్వడానికీ మధ్య ఉన్న తేడా..? హోదాకి బదులుగా అవే ప్రయోజనాలు ఇస్తామని కేంద్రం చెబితే.. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే సంబరపడుతుంది కదా. ఏపీ సీఎం కూడా అదే చేశారు. అంతేగానీ.. ఆర్థిక మంత్రి ప్రకటనల్ని ఎవరైనా అనుమానిస్తూ కూర్చుంటారా..?
రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేసేసినా కూడా తమపై విమర్శలు చేస్తున్నారని జీవీఎల్ అన్నారు. ఆ వెంటనే, పోలవరం విషయంలో కొన్ని నిధులు రావాల్సి ఉన్నాయనీ, అవి కొద్ది రోజుల్లోనే వస్తున్నాయని తనకు తెలిసిందన్నారు. తామే అన్ని శాఖలతో మాట్లాడి పనులు చేశామన్నారు. మరి, ఈ లెక్కన కేంద్రం అన్నీ ఇచ్చేసిందని టోకున జీవీఎల్ ఎలా మాట్లాడినట్టు..? రెవెన్యూ లోటు విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏం చొరవ తీసుకుందని జీవీఎల్ ఉల్టా ప్రశ్నించారు! రెవెన్యూ లోటు రూ. 16 వేల కోట్లుగా కాగ్ అంచనా వేసినప్పటికీ, అందులో రూ. 13,872 కోట్లు కొత్త పథకాల రెవెన్యూ ఖర్చులయ్యాయని చెప్పిందన్నారు. కొత్తగా పెట్టుకున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలిగానీ, కేంద్రం ఎందుకిస్తుందన్నారు. జీవీఎల్ చాలా కన్వీనియంట్ గా దాటేసిన మాట ఏంటంటే… ‘కాగ్ అంచనా వేసినప్పటికీ’ అంటూ లెక్కలు చెప్పడం..!
విచిత్రం ఏంటంటే.. నీతీ ఆయోగ్ లో చంద్రబాబు ప్రస్థావించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఏంటో చెప్పాలని జీవీఎల్ రివర్స్ లో డిమాండ్ చేస్తూ ఉండటం! రాష్ట్రం ఏం చేస్తుందీ… డిమాండ్ చేస్తుంది, అడుగుతుంది, తప్పకపోతే పోరాటానికి దిగుతుంది. ఇదే కదా ఏపీ ప్రభుత్వం చేస్తున్నది. అయినా, రాష్ట్రాల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది కేంద్రమా కాదా..? లేదంటే, హక్కులూ కేటాయింపులూ నిదులూ పన్నుల పంపకాల విషయాల్లో కేంద్రాన్ని రాష్ట్రాలు బతిమాలుకోవాలా..? జీవీఎల్ కి అర్థమైన ఫెడరల్ స్ఫూర్తి ఇదేనేమో. కేంద్రం ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, నాలుగేళ్ల తరువాత ఈ జీవీఎల్ లాంటివాళ్లతో ఇలా మాట్లాడిస్తే ఏమనుకోవాలి..? అయినా, రాష్ట్ర సమస్యల గురించి ప్రధానిని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే… జీవీఎల్ జవాబులు చెప్పేయడమేంటో..?