విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడటం లేదు. అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చే నేతలు మాత్రం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని అంటున్నారు. మైండ్ గేమ్ ప్రారంభించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో ఈ క్యాంపైన్ లీడ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన ఈ విషయంలో తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటికిప్పుడు జరగదని… అంటున్నారు. ఎప్పుడు జరుగుతుందంటే.. ఏడాది పట్టొచ్చని చెబుతున్నారు.
జీవీఎల్ మాట తీరు చూసి.. కార్మికులకు మండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఏడాదిలో ప్రైవేటీకరణ పూర్తవుతుందని చెప్పడమే కాదు.. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆ సమయంలో… ఏదో తాయిలాలు ప్రకటిస్తున్నారని ఆయనంటున్నారు. అంతే కాదు.. ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ విధానమని.. వెక్కి తగ్గేది లేదంటున్నారు. ఏపీలో బీజేపీకి పోయేదేమీలేదని జీవీఎల్ నరసింహారావు అనుకుంటున్నారేమో కానీ.. ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను అసలు పట్టించుకోవడం లేదు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు.. కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇంకొందరు ప్రకటనలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రతినిధులుగా వస్తున్న వారు మాత్రం… కార్మికుల్ని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సెంటిమెంట్‌గా మారిందని .. అమరావతిపై కులం ముద్ర వేసి.. ప్రజల్లో పూర్తి స్థాయిలో స్పందన రాకుడా చేసినా.. స్టీల్ ప్లాంట్ విషయంలో సాధ్యం కాదని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే చాలా మంది సైలెంటయిపోయారు.