రాజధాని తరలిస్తే ఊరుకోబోమంటూ.. కొత్తగా బీజేపీలో చేరిన నేతలు హూంకరిస్తూంటే… అమరావతిగా రాజధానిని ఉంచే ఉద్దేశం వైసీపీకి లేదని…ప్రకాశం జిల్లాకు రాజధాని తరలి పోయే అవకాశం ఉందని… పాత బీజేపీ నేతలు చెబుతున్నారు. సుజనా చౌదరి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఒక్క రోజులోనే… జీవీఎల్ నరసింహారావు… రాజధానిపై వైసీపీ వైఖరికి మద్దతుగా మాట్లాడారు. బీజేపీ అధికారప్రతినిధిగా తనకు ఉన్న సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని మార్చాలని అనుకుంటోందని ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు తరలించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం..కేంద్రం జోక్యం ఉండదని… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఆపలేమని జీవీఎల్ ప్రకటించారు.
రాజధానిని కొనసాగించకుంటే భూములు ఇచ్చిన రైతులను ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం ఆలోచించాని సూచించారు. ప్రస్తుతం వరద ముంపు, అధిక ఖర్చు అంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. అదే చేసి ఉంటే.. మార్చడానికి అవకాశం ఉండేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో అమరావతి ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండాలన్నారు. జీవీఎల్ వ్యాఖ్యలు ఇతర నేతల వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నాయి. దాంతో కలకలం బయలుదేరింది.
సుజనా చౌదరి, కన్నా లక్ష్మినారాయణ లాంటి బీజేపీ నేతలు.. ఇప్పటికే.. రాజధానికి మద్దతుగా ప్రకటనలు చేశారు. తరలిస్తే బీజేపీ ఊరుకోబోదని ప్రకటించారు. అయితే.. జీవీఎల్ మాత్రం పూర్తి రివర్స్‌లో వెళ్తున్నారు. రాజధానిని మార్చడం ఖాయమంటున్నారు. దీంతో..అసలు బీజేపీ విధానం ఏమిటన్నదానిపై…స్పష్టత లేకుండా పోయింది. బీజేపీలో పాత,కొత్త నేతల మధ్య పొసగని వాతావరణం ఏర్పడిందని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న భావన ప్రారంభమయింది.