భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు .. ఆరోపణలే రాజకీయం అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ కార్యక్రమం చేపడితే.. ఆ కార్యక్రమాన్ని… అడ్డదిడ్డమైన వాదనలతో విమర్శించడానికి.. ఫక్తు రాజకీయ నాయకునిలా రెడీ అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం వాదనను … వినిపిస్తున్న జీవీఎల్ నరసింహారావు… ఒక్కటంటే.. ఒక్క విషయంలోనూ కేంద్రం చేస్తున్నది కరెక్టే అనిపించేలా ప్రజలకు సంతృప్తికర వాదనను వినిపించలేకపోయారు. ప్రభుత్వం, టీడీపీ తరపున నేతలు లెవనెత్తే ప్రస్నలకు సమాధానాలు చెప్పలేక తడబడుతూ.. వారికేం తెలియదని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు వ్యతిరేకమట. ఎందుకు అంటే… 2015లో కేంద్రం నిమ్జ్‌ను మంజూరు చేసిందట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భూమి కేటాయించలేదట. వాస్తవానికి కనిగిరి నియోజకవర్గంలోనూ గత యుపిఎ ప్రభుత్వం పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. కనిగిరిలో నిమ్జ్ పేరుతో సెజ్‌ను ప్రకటించింది. పామూరు, పీసీపల్లి మండలాల్లో 14,235 ఎకరాలను గుర్తించారు. ఇందులో మూడు రకాల భూములున్నాయి. పట్టా భూమి, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములున్నాయి.దాదాపుగా 2 వేల ఎకరాల ఏపీఐఐసి భూమి ఉన్నా.. కేంద్రం.. ఆ భూముల్లో ఏర్పాటు చేయడానికి ఒక్క పరిశ్రమనూ ప్రొత్సహించలేదు. కానీ ఇప్పుడు జీవీఎల్ ఆ ప్రాజెక్ట్‌ను మోడీ ఇచ్చినట్లుగా చెప్పుకుని… దానికి ఏపీ ప్రబుత్వమే అడ్డం పడుతోందన్నట్లుగా విమర్శలు ప్రారంభించారు.
జీవీఎల్ ఇలా ప్రకాశం జిల్లాను చూపించి టీడీపీపై విమర్శలు ప్రారంభించానికి ఓ కారణం ఉంది. ఇరవై ఎనిమిదో తేదీన తెలుగుదేశం పార్టీ.. ఒంగోలులో ధర్మ పోరాట దీక్ష నిర్వహిస్తోంది. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జిల్లాల వారీగా ధర్మ పోరాట దీక్షలతో చంద్రబాబు వివరిస్తున్నారు. అక్కడ కూడా మోడీ ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించి.. బీజేపీ ఇజ్జత్ తీసేయడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకే జీవీఎల్ ప్రకాశం జిల్లాకు టీడీపీ వ్యతేరికమంటూ.. ఢిల్లీలో కూర్చుని విమర్శిస్తున్నారు. ఇప్పుడు దీక్ష పేరుతో ఒంగోలు వెళితే జిల్లా ప్రజలు నమ్మరని కూడా చెప్పుకొచ్చారు. బీజేపీకి జీవీఎల్ తప్ప.. ఏపీ వాదన వినిపించడానికి మరో నేత దొరకడం లేదు. ఎవరు మాట్లాడినా పట్టించుకోవడం లేదు. దాంతో జీవీఎల్ కు తప్పడం లేదన్న వాదన ఢిల్లీలో వినిపిస్తోంది.