ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరిని నియమించడంతో జీవీఎల్ నరసింహారావు కంగారు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తో పొత్తు ఉంటుందని విశాఖ సీటును బీజేపీకి కేటాయిస్తారని.. ఆ సీటు తనకే వస్తుందని ఆయన చాలా కాలంగా అక్కడ వారాంతాల్లో పని చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి ఆయనకు భరోసా ఇచ్చారని చెబుతున్నారు. కానీ బీజేపీలో విశాఖకు చాలా పోటీ ఉంది. విశాఖ నుంచి పురందేశ్వరి గతంలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
జీవీఎల్ విశాఖపై కన్నేయడంపై గతంలోనే ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఏపీకి చీఫ్ కావడంతో జీవీఎల్ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. తాను అక్కడ పాతుకుపోయానని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత మంది బీజేపీ నేతల్ని చేరదీసి.. తన వర్గంగా ప్రచారం చేసుకుని… ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతకు మించి ఆయన చేసేదేమీ ఉండదు. పురందేశ్వరి నిజంగా తాను ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేయాలని అనుకుంటే ఇప్పుడు ఆమెను అడ్డుకునేంత పలుకుబడి జీవీఎల్ కు లేకుండా పోయింది.
వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులుంటాయో బీజేపీ నేతలకు స్ప,ష్టత లేదు. పొత్తులు లేకపోతే మాత్రం.. ఎవరు పోటీ చేసినా పెద్దగా పట్టించుకోరు. కానీ టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జీవీఎల్ విశాఖకు వచ్చేందుకు పెట్టుకున్న ఖర్చులన్నీ వృధా పోయే అవకాశం కనిపిస్తోంది.