అన్లాక్ 3 నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. సినిమా హాళ్లకు పర్మిషన్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగినా.. కిషన్ రెడ్డి లాంటి కేంద్రమంత్రులు సానుకూల ప్రకటనలు చేసినా.. చివరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. సినిమా హాళ్ల ఓపెనింగ్ పై నిషేధం కొనసాగుతుందని… కేంద్రం ప్రకటించింది. ఆగస్టు ఐదో తేదీ నుంచి జిమ్ములు.. యోగా సెంటర్లకు మాత్రం.. రిలీఫ్ ఇచ్చింది. అదే సమయంలో.. దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేశారు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు కూడా.. ఆగస్టు మొత్తం మూసే ఉంచుతారు. ఇప్పటి వరకూ నిషేధం ఉన్న వాటిలో… జిమ్ములు.. యోగా సెంటర్లు తప్ప.. వేటికీ అన్లాక్ 3లో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వలేదు.
ఇక కంటెన్మెంట్ జోన్లలో ఆగస్టు 31వ రకు కఠిన లాక్ డౌన్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే.. ఇప్పటికే.. అనేక రాష్ట్రాలు ఈ కంటెయిన్మెంట్ జోన్ల ప్రస్తావన తీసుకు రావడంలేదు. అంతర్జాతీయ విమానయానంపై కూడా నిషేధం కొనసాగుతుంది. హోంశాఖ అనుమతించిన సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రాజకీయ, క్రీడా, వినోత, విద్యా, సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక వేడుకలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగుతుంది. ఆగస్టు పదిహేను.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని భౌతిక దూరం నిబంధనలు అమలు చేస్తూ.. పాటించాలని.. కేంద్రం సూచించింది.
ఇక.. కేంద్రం ఇచ్చిన రిలీఫ్లను అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాలకే వదిలేశారు. రాష్ట్రాల్లో స్థితిగతులకు తగ్గట్టు స్థానికంగా అదనపు ఆంక్షలు విధించుకోవచ్చని.. కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు.. సొంతంగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. కొన్ని నగరాల్లో లాక్ డౌన్ పాటిస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను మాత్రం సడలించే అధికారం రాష్ట్రాలకు లేదు. అంటే సినిమా హాళ్లు, స్కూళ్లు ప్రారంభించాలని రాష్ట్రాలు నిర్ణయించుకున్నా సాధ్యం కాదు.