అగ్రిగోల్డ్ కేసు అనూహ్య మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు! హాయ్ ల్యాండ్ ఆస్తి తమది కాదంటూ హైకోర్టులో అగ్రిగోల్డ్ సంస్థ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో అగ్రిగోల్డ్ సంస్థపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్ ల్యాండ్ కు సంబంధించిన ఇంతటి కీలక సమాచారాన్ని విచారణలో భాగంగా ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదంటూ నిలదీసింది. హాయ్ ల్యాండ్ ఎండీ వెంకటేశ్వర్రావుపై విచారణకు సీఐడీని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు, అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీఐడీ చేస్తున్న విచారణపై కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలంటూ కోర్టు చెప్పింది.
దీంతో, ఇన్నాళ్లూ సీఐడీ దీనిపై ఏం చేసిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి..? హాయ్ ల్యాండ్ ఎవరిది..? ఎవరి పేరున రిజిస్ట్రేషన్ జరిగింది..? దాన్లో భాగస్వాములు ఎవరున్నారు, ఏవైనా వివాదాలున్నాయా… ఇలాంటి ప్రాథమిక విషయాలను కూడా దర్యాప్తులో భాగంగా తెలుసుకునే ప్రయత్నం జరగలేదా అనిపిస్తోంది! గడచిన మూడేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదనతో ఉన్నారు. ఇంకోపక్క, ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు కూడా ఎవరి అజెండాతోవారు ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా, కోర్టుకు సరైన వివరాలను ఇవ్వలేని పరిస్థితిలో సీఐడీ ఉందా అనే విమర్శలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి.
అగ్రిగోల్డ్ కి ఉన్న ఆస్తుల్లోనే అతిపెద్దది ఈ హాయ్ ల్యాండ్. కొన్ని వందల కోట్ల విలువ ఉంటుంది. ఇంకోపక్క, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల విషయమై ప్రభుత్వమూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూ, ఆ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వేలం ప్రక్రియకు కూడా వెళ్లింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడీ ఆస్తులు తమవి కావు అంటూ సంస్థ చెప్పడం, ఈ మొత్తం కేసులోనే కీలక మలుపు అనుకోవచ్చు. దీంతో ఇప్పటికే తమ సొమ్ము తిరిగి వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న బాధితులకు, తాజా పరిణామం మరింత టెన్షన్ పెంచేదిగా మారింది. ఏదేమైనా, దర్యాప్తులో సీఐడీ పూర్తిగా విఫలమైందనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి.