హారిక హాసిని అంటే.. త్రివిక్రమ్ సినిమాలా తయారైంది. హారికలో తెరకెక్కుతున్నవన్నీ త్రివిక్రమ్ సినిమాలే. బయటి దర్శకులతో హారిక సినిమాలు చేస్తున్నా – వాటి విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం తప్పని సరి. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తాజాగా తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ కూడా హారిక నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ సంస్థలో త్రివిక్రమ్ శిష్యుడు కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఛలో’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి యువ హీరోలు, పేరున్న నిర్మాతలు రెడీగా ఉన్నారు. త్వరలోనే గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకీ. ఇప్పుడు హారిక కూడా అవకాశం ఇచ్చిందని సమాచారం. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది కూడా త్రివిక్రమే అని టాక్. గతంలో.. తన శిష్యుడు చైతన్యకృష్ణ తో ‘ఛల్ మోహన రంగ’ సినిమాని హారిక లోనే తీయించాడు త్రివిక్రమ్. ఆ సినిమాకి కథ ఇవ్వడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇప్పుడు మాత్రం… త్రివిక్రమ్ కథ, నిర్మాణం విషయంలో కలగజేసుకోవడం లేదట. కథ పూర్తిగా.. వెంకీదే అని, నిర్మాణ బాధ్యతల్ని కూడా పూర్తిగా హారికనే చూసుకోనున్నదని తెలుస్తోంది. మరి.. హారిక – వెంకీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకి హీరో ఎవరన్నది తెలీరాలేదు. హీరో ఎవరన్నది త్రివిక్రమ్ డిసైడ్ చేస్తాడేమో చూడాలి.