హారిక హాసిని నిర్మాత రాధాకృష్ణకు త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. ఈమధ్య హారిక హాసిని సినిమాల్నీ త్రివిక్రమ్ డైరెక్షన్లోనే. బయటి దర్శకులతో సినిమాలు చేసినా త్రివిక్రమ్ సలహాలూ సూచనలు తప్పని సరి. ప్రస్తుతం ఎన్టీఆర్తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా హారిక హాసిని సంస్థలోనే. అయితే ఈసారి `కమాండింగ్` మొత్తం ఎన్టీఆర్ చెతుల్లోకి వెళ్లిపోయిందట. ఎన్టీఆర్ పుట్టిన రోజున.. ఫస్ట్ లుక్ వదలడం దగ్గర నుంచి, దాని డిజైనింగ్, లోగో సెలక్షనూ ఇవన్నీ ఎన్టీఆరే చూసుకున్నాడట. త్రివిక్రమ్ మాట జవదాటని రాధాకృష్ణ ఇప్పుడు ఎన్టీఆర్ మాటకు ఎదురు చెప్పడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎంత చెబితే అంత.. ఏం చెబితే అది. ‘ఈ ఒక్క సినిమా విషయంలో నాకు వదిలేయండి.. ప్రమోషన్స్తో సహా’ అని ఎన్టీఆర్ గట్టిగా చెప్పాడని, దానికి రాధాకృష్ణ కూడా ‘సరే’ అన్నారని తెలుస్తోంది. హారిక హాసిని సంస్థకు ఓ వ్యక్తిగత పీఆర్వో ఉన్నాడు. హారిక సినిమాలకు తనే పీఆర్వో. హీరో పవన్ అయినా, నితిన్ అయితే.. పీఆర్వోగా అతని పేరే ఉండేది. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ పీఆర్వోలు రంగంలోకి దిగారు. దీని వెనుకా ఎన్టీఆర్ అదేశాలే బలంగా ఉన్నాయని సమాచారం.
నిజానికి ఈ కథ రూపు రేఖలు ఎన్టీఆర్ సూచనలకు అనుగుణంగా మార్చాడట త్రివిక్రమ్. ‘అరవింద సమేత వీర రాఘవ’ కథా నేపథ్యం పూర్తిగా వేరు. మిలటరీ నేపథ్యంలో సాగే కథ ఇది. కానీ.. ఎన్టీఆర్ మాత్రం దాన్ని రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కి మార్చమని చెప్పాడట. అలా… ఈ సినిమా బ్యాక్ డ్రాపే మారిపోయింది. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా బాగా నిరాశ పరచడంతో… తాను కూడా బ్యాక్ స్టెప్ లోనే ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ సూచనలకు అనుగుణంగా కథలో మార్పులు చేర్పులు చేయడానికి వెనుకాడడం లేదని తెలుస్తోంది.