బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడ్ పెంచాడు. ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే అందులో బెల్లంకొండ ష్యూర్ షాట్ గా నమ్మకం పెట్టుకొన్న ఓ సినిమా వుంది. దానికి… లుధీర్ బైరెడ్డి అనే ఓ కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఈరోజు విడుదలైంది. ఈ గ్లింప్స్ చూస్తే.. బెల్లంకొండ నమ్మకం దేనిమీదో అర్థం అవుతుంది.
జస్ట్ టైటిల్ గ్లింప్స్ ఇది. దాదాపు 3 నిమిషాల పాటు సాగింది. ఓ టైటిల్ గ్లిమ్స్ ట్రైలర్ అంత పెద్దగా ఉండడం ఇదే తొలిసారి. అయితే… ప్రతీ క్షణం ఓ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించడం, దాన్ని అడ్డుకోవడానికి హీరో వెళ్లడం, దశావతారాలూ ఆ హీరోని అండగా నిలవడం ఇదీ కాన్సెప్ట్. దీన్ని బట్టి కథని అర్థం చేసుకోవొచ్చు. దర్శకుడి ఐడియా, విజువల్ సెన్స్, ఈ గ్లిమ్స్కి ఇచ్చిన ఆర్.ఆర్.. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ‘హైందవ’ అనే టైటిల్ కూడా పవర్ఫుల్ గా ఉంది. ఈమధ్య హిందుత్వానికి సంబంధించిన కథలు, అంశాలూ బాగా కనెక్ట్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సబ్జెక్ట్స్కి ఆదరణ బాగుంది. ఈ నేపథ్యంలో.. ‘హైందవ’ కూడా గురి తప్పదన్న నమ్మకం కలుగుతోంది. దాదాపు రూ.50 కోట్లతో రూపొందిస్తున్న సినిమా ఇది. ఆ ఖర్చు రేపు తెరపై కనిపిస్తుందన్న నమ్మకం ఈ గ్లిమ్స్ ఇచ్చింది. కేవలం టైటిల్ గ్లిమ్స్ ఇది. ఇదే ఇంత ఆసక్తికరంగా ఉందంటే, రేపు టీజర్, ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటాయో..? సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. మహేష్ చందు నిర్మాత.