సూటిగా….సుతిమెత్తగా…… భండారు శ్రీనివాసరావు
హాఫ్ లయన్ పీవీ నరసింహారావు
చదివేవీ చదివించేవీ కొన్ని. చదివిన తరువాత ఎందుకు చదివాము అనిపించేవి మరి కొన్ని.
ఇప్పుడు చెప్పుకోబోయేది మొదటి రకం పుస్తకం గురించి.
దాని పేరు ‘నరసింహుడు’. సినిమా టైటిల్ లా అనిపించినా మంచి పుస్తకానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ వున్నాయి. చూడగానే కళ్ళల్లోపడేట్టు తీర్చి దిద్దారు. దానికి కారణం ఈ అనువాద గ్రంధాన్ని ప్రచురించింది ఎమెస్కో కావడం. ఖర్చుకు వెనుతీయకుండా వెలువరించిన ఘనత ఎమెస్కో విజయకుమార్ ది.
ఆంగ్లంలో ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ జర్నలిష్టు వినయ్ సీతాపతి రచించారు. తెలుగు తెలియకపోయినా ఒక తెలుగు ప్రధాని గురించి రీసెర్చ్ చేసి మరీ రాశారు. మువ్వురు సుప్రసిద్ధ జర్నలిష్టులు, జీ. వల్లీశ్వర్, టంకశాల అశోక్, డాక్టర్ కే.బీ.గోపాలం కలిసి తెలుగులోకి అనువదించారు. వీరిది మక్కికి మక్కి తెనుగుసేత కాదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆంగ్లంలో ఈ పుస్తకం పేరు ‘HALF LION” (సగం సింహం). తెలుగులో ‘అరసింహుడు’ అని అనువదించకుండా ‘నరసింహుడు’ అనే పెట్టారు. పుస్తకం రాసింది మాజీ ప్రధాని, కీర్తిశేషులు పీవీ నరసింహారావు గురించి కాబట్టి ఆ పేరు పెట్టడమే భావ్యం. పుస్తకంలో ఘనత అంతా దీన్ని ఇంగ్లీష్ లో తొలుత రాసిన వినయ్ సీతాపతిదే. అయితే ముగ్గురు చేయి తిరిగిన తెలుగు జర్నలిష్టు రైటర్లు ఒకే స్రవంతిలో పుస్తకం చదువుతున్న అనుభూతిని పాఠకులకు మిగల్చడంలోనే వారి అసమాన ప్రతిభ దాగివుంది. దానికి కారణం వారు పాత్రికేయ రచయితలు కావడమే. ఈ కార్యానికి వారిని ఎంచుకున్న ఎమెస్కో వారు అభినందనీయులు. ఈ పుస్తకంలో ఏముందీ అన్నది విడుదలకు ముందే జనాలకు తెలిసిపోయింది. ఆ మేరకు ఒక ప్రముఖ దినపత్రిక, ఆంధ్ర జ్యోతిలో ఈ పుస్తకంలోని ఆసక్తికరమైన అంశాలను మరింత ఆసక్తికరంగా ప్రచురించడంతో పాఠకులకు కూడా దీని పట్ల ఆసక్తి రగిలింది. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయిన అసంఖ్యాక ప్రేక్షకులే దీనికి దృష్టాంతం.
పీవీ ప్రధానిగా వున్నప్పుడు ఆయనకు సన్నిహితంగా వున్న ఐ.ఏ.ఎస్. అధికారులు, పద్మనాభయ్య, పీవీ ఆర్కే ప్రసాద్, ఐ.పీ.ఎస్. అధికారి కే.విజయరామారావు ఆహూతుల్లో వున్నారు. అలాగే పీవీ కుమారులు పీవీ రాజేశ్వర రావు, పీవీ ప్రభాకరరావు హాజరయిన వారిలో వున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తమ ప్రసంగంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే.రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ ఆంగ్ల తెనుగు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఇక ఈ పుస్తకం గురించి చెప్పుకుందాం. ఈ వ్యాసంలో పేర్కొన్నవన్నీ ఈ పుస్తకంలోని విషయాలే.
సాధారణంగా ప్రసిద్దులయిన రాజకీయ నాయకుల జీవిత విశేషాలు గురించి రాసే రచయితలు సంచలనాత్మక అంశాలను అందులో జోడిస్తుంటారు. ఇందుకు ఈ పుస్తకం మినహాయింపు కాదు. అయితే రచయిత వినయ్ సీతాపతి ఈ విషయంలో ఒక కఠోర నియమం పాటించినట్టు పుస్తకం చదివిన వారికి అర్ధం అవుతుంది. సంచలన అంశాలే కాదు, సాధారణ అంశాలను కూడా ఎంతో శ్రమకోర్చి వివరాలు ధ్రువ పరచుకున్న తరువాతనే వాటిని తన పుస్తకంలో పొందుపరిచారు. ప్రతి విషయమూ ఎవరి నుంచి సేకరించిందీ పుస్తకం చివర్లో ఒక జాబితా ఇచ్చారు. దానికి తోడు విషయాలను ధ్రువ పరచుకోవడానికి అవసరమైన పత్రాలను పరిశీలించిన మీదనే వాటిని ఈ గ్రంధంలో క్రోడీకరించ డాన్ని బట్టి చూస్తే, ఇదొక పరిశోధనాత్మక గ్రంధం అనిపిస్తుంది. దీనివల్ల రచయిత పట్ల ఆయన చేసే రచనల పట్ల పాఠకుల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
రాజకీయ పార్టీల్లో, కాస్త హెచ్చు తగ్గులు వుండవచ్చు కానీ, అధినాయకుల ఆజమాయిషీ ఎక్కువే. కాంగ్రెస్ పార్టీలో ఇది కాస్త హెచ్చుగా కనిపిస్తుంది. వారిది నాయకుడు ఎప్పుడూ రైటే అనే పాలసీ. అంతే కాదు వెనుకటి రాజుల్లో వుండే ఆగ్రహానుగ్రహాల పాలు కూడా ఎక్కువే. తెలంగాణా నుంచి ఎన్నికయిన రాజ్య సభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంత రావు , గతంలో, ఒకసారి పీవీ విగ్రహం వరంగల్లులో పెట్టించాలని అప్పటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసారు. స్థానిక నాయకులు పడనివ్వలేదు. కారణం, విగ్రహం పెట్టినప్పటినుంచి, ఏటా జయంతులకీ, వర్ధంతులకీ వెళ్లి దండలు వేయాలి, ఎవడన్నా ఫోటో తీసి సోనియాకు పంపుతారేమో అని వారి భయంట.
పీవీ చనిపోయిన చాలా ఏళ్ళ తరువాత కానీ ఈ పరిస్తితిలో మార్పు రాలేదు. తెలంగాణలో అధికారానికి వచ్చిన టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం, పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. అంతే కాకుండా పీవీ చరిత్రను హైస్కూలు స్థాయిలో పాఠ్య ప్రణాళికలో చేర్చాలని కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఇక సుబ్రమణ్య స్వామి, పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోపలి మనిషి మాదిరిగా కానవచ్చే పీవీలో ఇచ్చిన మాటకు కట్టుబడే గుణం వుంది.
పీవీ కన్న తలితండ్రులు ఆయన్ని దత్తు ఇచ్చారు. కన్న తండ్రి అవసాన దశలో, పీవీని దగ్గరకు పిలిపించుకుని, ‘చూడూ నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు దత్తత వెళ్లావు కాబట్టి ఈ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని అనుకోకు, మీ అమ్మనీ, తమ్ముళ్ళ చూసుకోవాల్సిన బాధ్యత నీదే’ అని మాట తీసుకున్నారు. ఆయన కూడా జీవితాంతం ఆ మాట నిలబెట్టుకున్నారు.
చిన్న వయస్సులోనే తలితండ్రులకి దూరం కావడం పీవీ మనస్సులో గట్టిగా నాటుకు పోయింది. డెబ్బయి ఆరేళ్ళ తరువాత ఢిల్లీ ఆసుపత్రిలో చివరి రోజులు గడుపుతున్నప్పుడు ఆయన నోట ఇవే పలవరింతలు. ‘అదిగో మన వూళ్ళో చెరువు గట్ట మీద నడుస్తున్నాను. నాన్న తెల్లటి బట్టలు వేసుకుని రమ్మని పిలుస్తున్నాడు. నన్ను వెళ్ళనివ్వండి అంటూ పలరించేవార’ని పీవీ చిన్న కుమారుడు ప్రభాకరరావు గుర్తు చేసుకున్నారు.
ఆయన ఒక జీవిత సత్యాన్ని తానే రాసుకున్నారు.
‘ఎవరయినా జీవితంలో ముందుకు సాగుతూ , పైకి ఎదుగుతున్నప్పుడు, తన మనస్సుకి నచ్చే విధంగా నడుచుకోగలిగే సందర్భాలు తగ్గిపోతుంటాయి’.
ఒక రకంగా ఇందిరాగాంధీ హయాములోనే ఆయన హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలి అన్న కాంక్ష లేకపోవడమే. ఇందిరకు కూడా పీవీలోని ఈ మనస్తత్వం బాగా నచ్చింది. అయినా, అధినాయకురాలికి యెంత నమ్మకస్తుడయినా పీవీకి ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పలేదు.
‘ఇందిరా గాంధీకి రాజకీయంగా బలం లేని, బలవంతుడయిన (సమర్దుడయిన) నామినేటెడ్ ముఖ్యమంత్రి కావాలి. కానీ ఇది ఎలా సాధ్యం’ అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తరవాత పీవీకి కలిగిన మీమాంస.
వయస్సు మీరినట్టు కానవచ్చే పీవీలో జనాలకు అంతగా తెలియని దార్శనికుడు వున్నాడు. అంచేతే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఎవరూ సాహసించని భూసంస్కరణలకు ఆయన తెర తీశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు భూసంస్కరణల చట్టం తెచ్చింది ఆయనే. ఇదే ఆయన ఉద్వాసనకు మార్గం వేసింది. ఆ చట్టం కింద, స్వగ్రామం వంగరలో తనకున్న పన్నెండువనదల ఎకరాల్లో వెయ్యి ఎకరాలను స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పగించారు. వూళ్ళో భూమిలేని పేదలకు తలా రెండెకరాల చొప్పున అధికారులు పంచి పెట్టారు. అంచేత వాళ్లకి పీవీలో ఒక అనాధరక్షకుడిని చూసారు. వంగర వెళ్ళినప్పుడు పొలం గట్ల మీద నడుస్తూ, రైతులతో ముచ్చటించడం ఆయనకు ఇష్టం. భూసంస్కరణల చట్టం ఆయన పదవికి మోసం తెచ్చింది కానీ పేదల గుండెల్లో మాత్రం ఆయనకు స్థానం కల్పించింది.
అలాగే కొన్ని సందర్భాలలో మితభాషిగా పేరుపొందిన పీవీని అయన వ్యాఖ్యలే ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం తీర్పుపై ‘ ‘అది ఫైనల్’ అంటూ ఆయన అతి క్లుప్తంగా చేసిన వ్యాఖ్య వీటిల్లో ఒకటి. అలాగే ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ విషయంలో పీవీ అన్యాపదేశంగా చేసిన మరో వ్యాఖ్య.
‘సంప్రదింపులతో పని జరిగే చోట సంకెళ్ళు పనిచేయవు’ అని పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన ఒకసారి అన్నమాటను, పార్టీలోని ప్రత్యర్ధులు ఎమర్జెన్సీతో ముడిపెట్టి వదంతులు ప్రచారం చేయడం ఆయన రాజకీయ పురోగతికి అడ్డంగా మారింది. అప్పట్లోనే అంటే ఇందిరా గాంధి హయాములోనే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఈసారి పీవీకే అని ఢిల్లీలో సాగిన ప్రచారంపై, ఆ పుకార్లు నీళ్ళు చల్లాయి. దరిమిలా ఇందిరాగాంధీకి పీవీ పట్ల విముఖత కలగడానికి కారణం అయింది. వస్తుంది అనుకున్న అధ్యక్ష పదవి రాకపోగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పోయింది. పదవి పోయిన తరువాత దొరికిన ఖాళీ సమయాన్ని పీవీ స్పానిష్ భాషని నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. సొంతంగా కారు నడుపుకుంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళేవారు.
అలా పట్టిన ఏలిన నాటి, ఏడేళ్ళ తరువాత, జనతా ప్రభుత్వ పతనంతో ముగిసింది. తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధి ప్రభుత్వంలో మళ్ళీ మంత్రి పదవి లభించింది.
ఇందిరాగాంధి దారుణ హత్య అనంతరం అనూహ్యంగా రాజీవ్ గాంధి ప్రభుత్వ పగ్గాలు స్వీకరించారు. అప్పటికే పీవీ ద్వితీయ స్థానంలో కొనసాగగలిగే రాజనీతిని అలవరచుకున్నారు. తనకన్నా వయస్సులో ఇరవై మూడేళ్ళు చిన్న వయస్కుడయిన ప్రధానమంత్రితో సర్దుకుపోయి పనిచేయగలిగారు. ఇందుకు ఓ ఉదాహరణ. పీవీ నరసింహారావు సమక్షంలోనే రాజీవ్ గాంధీ ఒక మిత్రుడితో చెప్పాడు. ‘దేశంలోకి కంప్యూటర్ల దిగుమతులని పోత్సహించాలని అనుకుంటున్నాను. ఎటొచ్చీ మా పార్టీలో ముసలాళ్ళకు ఇది అర్ధం కాదు. ‘. అప్పుడు రక్షణ మంత్రిగా వున్న పీవీకి ఈ మాటలు వినపడ్డాయి. వినబడనట్లే వుండిపోయారు.
తరువాత ఆయన అమెరికాలో వున్న తన కుమారుడు ప్రభాకర్ తో చెప్పి ఒక కంప్యూటర్ తెప్పించుకున్నారు. అంతవరకూ ఆయన ఎప్పుడూ విని ఎరుగని కోబాల్, బేసిక్స్ అనే కంప్యూటర్ భాషలను పట్టుబట్టి నేర్చుకున్నారు.
వెంకట్రామన్ రాష్ట్రపతి కాకముందు పీవీ ఆ పదవి కోసం కొన్ని ప్రయత్నాలు చేసారు. రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులతో మాట్లాడిపెట్టమని, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి (తదనంతర కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు) తనతో చెప్పారని రచయిత వినయ్ సీతాపతి పేర్కొన్నారు.
పీవీలోని రచయిత మేల్కొన్నప్పుడు ఆయన, వామపక్ష భావజాల మాస పత్రిక మెయిన్ స్ట్రీమ్ ఆంగ్ల పత్రికకు ఆకాశరామన్న అనే మారు పేరుతొ వ్యాసాలు రాసేవారు. బహుశా తన అసలు పేరుతొ కాకుండా రాయడం వల్ల ఆకాశరామన్న అనే పేరు పడిందేమో తెలవదు. సాధారణంగా అలా పీవీ రాసే రచనలను ‘అవతలి సగం’ అనో, ఆకాశ రామన్న అనో ఆ వ్యాసం కింద వేసి ప్రచురించేవాళ్ళు. అధిష్టానం పై నిప్పులు చెరగడానికి ఆయన ఈ రచనా వ్యాసంగాన్ని ఎంచుకుకున్నారని అనుకోవచ్చు. అయోధ్య విషయంలో రాజీవ్ గాంధీ చేతకానితనాన్ని ఎండగడుతూ అదే పత్రికలో ‘ఒక కాంగ్రెస్ కార్య కర్త’ అనే పేరుతొ పీవీ ఒక విమర్శనాత్మక వ్యాసం రాసారు.
రాజీవ్ ఆకస్మిక ఘోరమరణం తరువాత పీవీని ప్రధానిని చేయడానికి ముందు కధ అనేక మలుపులు తిరిగింది. ఆ క్రమంలో సాగిన అనేక అంతపుర రహస్యాలు ఈ పుస్తకంలో వున్నాయి. రాజీవ్ వారసుడిగా తన పేరు బయటకు వచ్చిన తరువాత కూడా తనని వెనక్కి నెట్టేయడానికి పార్టీలో కొందరు చేసినప్రయత్నాలు ఆయనకి ఆగ్రహం తెప్పించాయి కూడా. అయినా సంయమనంతో వ్యవహరించడం వల్ల, సోనియా ఆమోద ముద్ర వేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయాయి. ఆ సమయంలో క్షణ క్షణానికీ మారిపోతున్న పరిణామాల క్రమంలో తెలియవచ్చిన విషయాలు అవగాహన చేసుకున్న తరువాత ‘నా మెదడులో చిత్రం పూర్తిగా వచ్చింది’ అని పీవీ అనుకున్నట్టు ఈ పుస్తకంలో తెలుగు అనువాదంలో వుంది. (పేజీ 130- ఈ అనువాదం కాస్త కృతకంగా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పనిలేదు)
ఉపశ్రుతి: వెనకటి రోజుల్లో బాపూరమణలు తమ ‘బంగారు పిచిక’ సినిమా కోసం హాస్య స్పోరకమైన యాడ్ రూపొందించారు. ఇందులో భారీ సెట్టింగులు లేవు, ప్రఖ్యాత నటీ నటులు లేరు. రంగురంగుల సెల్యూలాయిడ్ సినిమా కాదు. మంచి కధ. మంచి చిత్రం చూడాలని వుంటే మా సినిమా చూడండి.
ఎమెస్కోవారి ఈ పుస్తకానికి ఇది అక్షరాలా వర్తిస్తుంది. ఇప్పుడు షరా మామూలుగా ఆత్మకధలు, జీవిత చరిత్రలు మొదలయిన పుస్తకాల్లో వుంటున్న సంచలనాలు ఇందులో వున్నా వాటికి ఆధారాలు పొందుపరిచారు. ఇక షరా మామూలు వ్యక్తి పూజలూ లేవు, వ్యక్తిత్వ హననాలు లేవు. కేవలం ఒక గొప్పనాయకుడి ఘన చరిత్ర. దాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595