జగన్ రెడ్డిపై వైసీపీ నేతలు పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లుగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జగన్ చెల్లని పట్టాలు పంపిణీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కి చెంది నగం మంది ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. నిజానికి అది పార్టీ కార్యక్రమం కాదు. కానీ ఆ తేడాను చూపించడం జగన్ రెడ్డి ఎప్పుడో మానేశారు. పార్టీనే ప్రభుత్వం అంటున్నారు. అయినా సరే సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి సమాచారం లేదు. ఆయన వచ్చేందుకు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయలేదు.
రాజకీయంగా ఆయనను దూరం పెట్టారు వైసీపీ అధినేత. టిక్కెట్ ఇచ్చేది లేదని కూడా చెప్పకుండా పూర్తిగా అవమానించడం ప్రారంభించారు. దాంతో ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం పక్క చూపులు చూస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణగోపాల్, మానుగుంట మహీధర్ రెడ్డి కూడా హాజరు కాలేదు. వారికి జగన్ టిక్కెట్లు ఇవ్వలేదు. సరి కదా ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు. దీంతో వారు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో కొనసాగడం కూడా కష్టమన్న అంచనాలు ఉన్నాయి. ఇక మాజీ మంద్రి సిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా హాజరు కాలేదు. గత ఎన్నికల తర్వాత బెదిరించి మరీ పార్టీలో చేర్చుకున్న వీరికి జగన్ ఝులక్ ఇచ్చారు. కనీసం టిక్కెట్ల కేటాయింపులో పరిగణనలోకి కూడా తీసుకోలేదు.
వీరంతా తమ రాజకీయ భవిష్యత్ ను జగన్ గండంలోకి పెట్టేశారన్న అసంతృప్తితో సభకు హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా ఉత్సాహంగా లేరు. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో.. డ్వాక్రా మహిళల్ని.. లబ్దిదారుల్ని బలవంతంగా కార్యక్రమానికి తరలించారు. ఇరవై ఒక్క వేల ఇళ్ల పట్టాలని ప్రచారం చేశారు కానీ.. ఇప్పటికీ వెయ్యి కూడా సెంటు స్థలాలను రెడీ చేయలేదు.