గత పది రోజులలో ఎవరు ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేసినా- అవతలి వారికి కుట్రలు ఆపాదించినా- నంద్యాల వాసులు తమ పరిపక్వత చూపించారు. ప్రశాంతంగానే ఎన్నికల పోలింగ్ నడిపిస్తున్నారు. అదీ భారీగానే ఓట్లేస్తున్నారు.
మధ్యాహ్నానానికి యాభై శాతం ఓట్లు పడటం చూస్తుంటే అందరూ ఒక కృత నిశ్చయంతోనే ఓటేయడానికి వచ్చారన్నది స్పష్టమవుతుంది. ఎక్కువ పోలింగ్ ఎవరికి లాభం తక్కువ పోలింగ్ ఎవరికి మేలు వంటి లెక్కలు చాలా వున్నాయి గాని అవి తప్పిపోవడం కూడా చాలాసార్లు జరిగింది. ఆగష్టు 28వరకూ వేచి వుండటం ఉత్తమం. ఇంకా వూహాగానాల అవసరమూ లేదు, ఉపయోగమూ వుండదు.
ఇప్పటి వరకూ చాలా ఉప ఎన్నికలు చూశాను గాని ఇంత స్థాయిలో ఇరువైపులా కీలక నేతలు మొహరించి ధనం బలం అధికారం పలుకుబడి అన్నిటినీ గుమ్మరించిన ఉదంతం చూళ్లేదు. మాటల యుద్ధం ఇంతగా వెర్రితలలు వేసిన సందర్బం లేదు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత కూడా ఆంధ్ర ప్రదేశ్ వుంటుంది రాజకీయాలూ ఎన్నికల పోరాటాలూ వుంటాయి అని నేను చాలాసార్లు అన్నాను. అయినా కావాలనే ఉద్రిక్తత పెంచారు. ఇప్పుడు పోలింగ్ నిర్విఘ్నంగా పూర్తి కావస్తున్నది గనక అందరూ వూపిరి పీల్చుకోవచ్చు. ఫలితం వచ్చే రోజు మరోసారి వూపిరి బిగపడితే తెలిసిన తర్వాత తేల్చుకోవచ్చు.