హైదరాబాద్: ప్రస్తుత పోకడలు కొనసాగితే 2050 సంవత్సరం నాటికి ప్రపంచంలో సగంమంది… దాదాపుగా 500 కోట్ల మందికి షార్ట్ సైట్ ప్రాబ్లమ్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మళ్ళీ వీరిలో ఐదో వంతుమందికి కంటిచూపు పోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. మయోపియా అని వైద్యపరిభాషలో పిలిచే షార్ట్ సైట్ కంటి సమస్య విపరీతంగా పెరిగిపోతోందని చెబుతున్నారు. ఎక్కువగా నాలుగు గదులమధ్యే(ఇండోర్ యాక్టివిటీ) ఉండటం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, మొబైల్ స్క్రీన్లను చూస్తూ ఉండటం వలన ఈ షార్ట్ సైట్ సమస్య పెరుగుతోందని అంటున్నారు. 1970 – 2000 సంవత్సరాల మధ్యలో మయోపియా కేసులు అమెరికాలో రెట్టింపు అయ్యాయని తేలింది. ఆసియాలోని కొన్నిప్రాంతాలలో ఈ కేసులు మరింత తీవ్రంగా పెరిగాయని తెలిసింది. దక్షిణ కొరియాలో 96 శాతం టీనేజర్లు షార్ట్ సైట్ సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల సర్వేలలో తేలింది. సింగపూర్, చైనా, జపాన్ దేశాలలో ఇది 80-90 శాతంగా ఉంది. మానవ చరిత్రలో ముందెన్నడూ లేనంతగా ఇప్పడు మనుషులు నాలుగు గోడలమధ్య గడుపుతుండటం, డైలీ స్క్రీన్ టైమ్ లేకుండా ఎవరూ ఉండకపోవటం ప్రధాన కారణాలని తేల్చారు.