ప్రేక్షకుల అభిరుచి తెలుసుకోవడం ఫిల్మ్ మేకర్స్ కి ఎప్పుడు ఒక సవాలే. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతున్నాయి? ఎలాంటి ఎలిమెంట్స్ వున్న సినిమాలని ఇష్టపడుతున్నారు ? ఇలా ఎన్నో కోణాల్లో అలోచించి కథలు, పాత్రలు సిద్ధం చేస్తుంటారు. ఇందులో సక్సెస్ ఫుల్ సినిమాని ఫాలో అయ్యే ట్రెండ్ ఒకటి వుంది. ఒక సినిమా విజయం సాధిస్తే.. అదే తరహాలో ఇంకొన్ని సినిమాలు తయారు చేసే పద్దతి ఎప్పటినుంచో వుంది. ఇప్పుడు ‘హను-మాన్’ తో మళ్ళీ ఆ దారిలో నడిచే ఆలోచన కనిపిస్తుంది.
హను-మాన్ సినిమా ఒక సోషియో ఫాంటసీ. ఇందులో హనుమాన్ పాత్ర సినిమాఅంతా వుండదు కానీ వున్న ఫీలింగ్ కలిగించేలా కథని రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ. అది బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ విన్నా హనుమాన్ హనుమానే అనే వినిపిస్తుంది. సక్సెస్ ట్రెండ్ ని ఫాలో అయ్యే పరిశ్రమ ఇప్పుడు తమ సినిమాలో హనుమాన్ ఎలిమెంట్ వుంటే దాన్ని హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. చిరంజీవి ‘విశ్వంభర’ కాన్సెప్ట్ టీజర్ లో కనిపించిన పెద్ద హనుమాన్ విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఆ టీజర్ లో అదొక హైలెట్.
నిఖిల్ స్వయంభూ అనే సినిమా చేస్తున్నాడు. ఇదొక పిరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇందులో నిఖిల్ ఆంజనేయ స్వామి భక్తుడిగా కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పాడు. నిజానికి ఇలాంటి అంశాలు పెద్దగా హైలెట్ చేయరు. దాన్నో ప్రత్యేకతలా చెప్పుకోరు. కానీ ఇప్పుడు హనుమానియా నడుస్తోంది. ఆ రూట్ లోకి వెళ్లి ప్రమోట్ చేసుకున్నా ఎంతోకొంత ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించవచ్చనేది ఆలోచన. ఇవే కాదు… రానున్న రోజుల్లో చాలా చిత్రాల్లో హనుమంతుల వారి రిఫరెన్స్ లు, స్పెషల్ సాంగ్స్ పుష్కలంగా కనిపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదంతా హనుమానియా ఎఫెక్ట్.