Hanu-Man Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్
మనకు ‘హీమాన్’లూ, ‘సూపర్ మాన్లూ’, ‘స్పైడర్ మాన్’లూ నచ్చేసినప్పుడు… మన ‘హనుమాన్’ ఎందుకు నచ్చడు? మన హనుమంతుల వారి కంటే… ఈ విదేశీ మాన్లు ఎందులో గొప్ప.. ఎక్కడ గొప్ప..? ఈ ఆలోచన ప్రతీసారీ వస్తూనే ఉంటుంది. ‘ఛోటా భీమ్‌ని’ చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లూ ఇష్టపడ్డారంటే దానికి కారణం… ఆయన ‘మన సూపర్ హీరో కాబట్టి’. బహుశా.. ఇదే పాయింట్ ప్రశాంత్ వర్మ ని ఆకర్షించి ఉంటుంది. సంజీవనిని హనుమంతుడు భుజాలనెత్తుకొన్నట్టు ఈ ‘హను మాన్’ కథని ప్రశాంత్ వర్మ నెత్తిమీద వేసుకొన్నాడు. అక్కడే తను సగం విజయం సాధించేశాడు. మిగిలిన సగం – టేకింగ్ లోనూ, మేకింగ్ లోనూ, కథ చెప్పే విధానంలోనూ ఉంది. మరి… సూపర్ హీరో కథని ఎత్తుకోవడం సక్సెస్ అయిన ప్రశాంత్ వర్మ – ఆ కథని రక్తికట్టించడంలోనూ విజయం సాధించాడా? ఈ సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుందేమో అని భయపడ్డ ఈ చిన్న సినిమా… ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించింది?
అంజనాద్రి అనే ప్రాంతం అది. అక్కడ హనుమంతు (తేజా సజ్జా) చేతి వాటం చూపిస్తూ… సరదాగా గడిపేస్తుంటాడు. స్వతహాగా బలహీనుడు. అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)కి తమ్ముడంటే ప్రాణం. తమ్ముడ్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక, పెళ్లి కూడా చేసుకోదు. అంజనాద్రి ప్రాంతం… పాలెగాళ్ల ఆధీనంలో ఉంటుంది. తమకు అడ్డొచ్చిన వాళ్లని ఏదో రూపంలో బలి తీసుకొంటుంటారు. అనుకోని సంఘటనతో… హనుమంతుకి కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు చూసి ఊరి వాళ్లంతా నివ్వెరపోతారు. మరోవైపు… మైఖెల్ (వినయ్‌రాయ్)కి సూపర్ మాన్లా శక్తుల్ని కూడదీసుకోవాలని కోరిక. చిన్నప్పుడు తన లక్ష్యానికి అడ్డొస్తున్నారని అమ్మానాన్నలనే చంపేస్తాడు. అలాంటి మైఖెల్‌కి… అంజనాద్రిలో తనకు కావల్సిన శక్తి ఉందని తెలుస్తుంది. ఆ శక్తిని వశం చేసుకోవడానికి మైఖెల్ ఏం చేశాడు? హనుమంతుకీ, మైఖెల్ కీ ఎలాంటి పోరాటం జరిగింది? ఈ కథలో హనుమంతుడి పాత్ర ఏమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాలి.
ఓ అనామకుడికి అదృశ్య శక్తులు వస్తే ఎలా ఉంటుందో చెబుతూ ఇది వరకు చాలా సినిమాలొచ్చాయి. అదే టాంప్లెట్ లో సాగే కథ ఇది. అయితే ఆ శక్తి హనుమంతుడు అవ్వడమే ‘హనుమాన్’ కథలో కొత్తదనం. ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయే పాయింట్ ఇది. సోషియో ఫాంటసీలో సౌలభ్యం ఏమిటంటే, అక్కడ లాజిక్కులు అవసరం లేదు. హనుమంతుడు దిగితే.. ఇక లాజిక్కులతో పనేముంది..? తెరపై ఓ మ్యాజిక్ మొదలవుతుంది. ‘హనుమాన్’ అసలు రహస్యం అదే. మైఖెల్ పాత్రని పరిచయం చేస్తూ ఈ కథని మొదలెట్టాడు దర్శకుడు. ఓ సూపర్ హీరో కావాలని కోరుకొనే.. ఓ మూర్ఖుడు నిజంగానే సూపర్ హీరో అయితే ఏం జరుగుతుందన్న ఉత్కంఠత కలిగిస్తూ ‘హనుమాన్’ని ప్రారంభించాడు. ఆ తరవాత… కథ అంజనాద్రికి షిఫ్ట్ అవుతుంది. అక్కడి వాతావారణాన్ని ఇంజెక్ట్ చేయడానికి హనుమంతు, అంజమ్మ, మీనాక్షి పాత్రల్ని పరిచయం చేయడానికి దర్శకుడు కొంత సమయం తీసుకొన్నాడు. పాలెగాళ్ల వికృతాలతో.. కథ కాస్త ముందుకు వెళ్తుంది. ఆ తరవాత… బంధిపోటు దాడితో హనుమాన్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్తుంది. అప్పుడే… హనుమంతు చేతికి ‘మణి’ దొరుకుతుంది. అక్కడి నుంచి.. తెరపై హీరో… హనుమాన్ లా విజృంభిస్తుంటాడు. హనుమంతుడు ఎప్పుడైతే తెరపైకి వచ్చాడో, అప్పుడు దర్శకుడికి సినిమాపై పట్టు దక్కేసింది. హనుమంతుల శక్తిని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలనుకొంటే అలా వాడుకొన్నాడు. పోపుల డబ్బా మూత కూడా తీయలేని ఓ సామాన్యుడు.. ‘మణి’ దక్కగానే విజృంభించడం, పెద్ద పెద్ద బండల్ని సైతం భుజాలపై మోయడం, ఉస్తాదుల్ని మట్టికరిపించడం చూస్తుంటే.. ముచ్చటేస్తుంటుంది. అక్కడ ఎవరూ లాజిక్కులు అడగరు. ఎందుకంటే.. తెరపై ఉన్నది తేజా సజ్జా కాదు.. అచ్చమైన మన హనుమంతుడు.
ఫాంటసీ సినిమాలకు కథ ఎలాగున్నా నడిచిపోతుంది. పెద్దగా డ్రామా కూడా అవసరం లేదు. కానీ విజువలైజేషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంజనాద్రి అనే ఊరు, జలపాతాల్ని ఆనుకొన్న హనుమంతుల విగ్రహం, ఆ ఊరి పరిసరాలు, కొండలూ కోనలూ, హనుమంతుడు పూనినప్పుడు హీరో చేసే విన్యాసాలు.. ఇవన్నీ పక్కాగా కుదిరిపోయాయి. ఉస్తాదుల్ని మట్టికరిపించి, వాళ్లందరిపైనా హీరో ఠీవీగా కూర్చున్న షాట్.. తప్పకుండా మెప్పిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మరింత రక్తి కట్టాయి. అక్కడ దర్శకుడి విజువల్ సెన్స్ నచ్చుతుంది. మంచు కొండల్ని బద్దలు కొట్టుకొని హనుమంతుల వారే శత్రు సంహారానికి దిగుతుంటే – అంతకంటే విజువల్ మూమెంట్ ఏముంటుంది? ఇలాంటి విజువల్స్ ఊహించుకోవడం ఒక ఎత్తు… దాన్ని సీజీల సహాయంతో పిక్చరైజ్ చేయడం మరో ఎత్తు. ఈ వషయంలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ మంచి మార్కులు పడతాయి. విభూషణుడు పాత్రలో సముద్రఖని హనుమంతుడి గొప్పదనం చెబుతున్నప్పుడు వేసిన షాట్స్ గూజ్బమ్స్ తెప్పిస్తాయి. ‘కార్తికేయ 2’లో శ్రీ కృష్ణుడి విశిష్టతను అనుపమ్ ఖేర్ చెప్పిన సీన్ ఈ సందర్భంగా గుర్తురాక మానదు. బహుశా.. ‘హనుమాన్`కీ అదే స్ఫూర్తి కావొచ్చు. కానీ.. ఇంపాక్ట్ మాత్రం రెండు చోట్లా బలంగా పండింది. సత్య వల్ల అక్కడక్కడ కొన్ని ఫన్ మూమెంట్స్ పండాయి. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఓకే అనిపిస్తుంది.
అలాగని… ఈ కథలో బలహీనతలు లేవని కాదు. అవీ ఉన్నాయి. హనుమంతుడే దిగి వస్తే తప్ప, అంజనాద్రి సమస్య తీరదా? అనేదానికి సమాధానం దొరకదు. అంజనాద్రికి ముంచుకొస్తున్న ముప్పేమిటో బలంగా చెప్పలేకపోయాడు. విలన్ పాత్ర కూడా అంత శక్తిమంతంగా ఉండదు. సాంకేతికతని ఆధారంగా చేసుకొని, అతడు సృష్టించే సమస్య ఏమిటో అర్థం కాదు. ఓ సమస్యని సృష్టించి, దాన్నుంచి అంజనాద్రికి ముప్పు ఉందని చెప్పి, దాన్ని కాపాడడానికి ఆంజనేయుడే రావాలని ప్రేక్షకుల చేత అనిపించి, అప్పుడు ఆ శక్తులు హీరోకి వచ్చినట్టు చేస్తే… ఈ కథ ఇంకా రక్తి కట్టేది. సమస్యని కేవలం ఊరికే పరిమితం చేయడం వెనుక దర్శకుడి ఉద్దేశ్యాలు వేరు కావొచ్చు. తన దగ్గర ‘హనుమాన్’ పార్ట్ 2 పాయింట్ కూడా ఉంది. ‘జై హనుమాన్’తో సీక్వెల్ కూడా సిద్ధం చేసుకొన్నాడు. బహుశా.. ఈసారి మరింత బలమైన కాన్ఫ్లిక్ట్ ఎంచుకొని ఉండొచ్చు. చివర్లో విభూషణుడి డైలాగులతో ఈ కథకు రామాయణానికి ఓ లింక్ ఇచ్చారు కూడా. శ్రీరాముడికి ఆంజనేయుడు ఇచ్చిన మాటేమిటి? అందుకోసం ఏం చేయబోతున్నాడు? అనే ఆసక్తిని చివర్లో రేకెత్తించారు. వీటన్నింటికీ సమాధానాల్ని ‘జై హనుమాన్’లో చూస్తామేమో..?
తేజా సజ్జా సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు. ‘హనుమాన్’ సినిమాలో తేజా హీరో అనగానే, తన ఇమేజ్ ఈ కథకు సరిపోతుందా? అని అంతా అనుమానించారు. నిజానికి ఈ కథ తేజాకే కరెక్ట్. ఓ సామాన్యుడు సూపర్ హీరో అవ్వడమే కథ. అందుకే తేజాకి ఇది టేలర్ మేడ్ అయ్యింది. తన లుక్ బాగుంది. నటన కూడా మెప్పిస్తుంది. తేజా కొండల్ని పిండి చేస్తే మనకు అదేదో జోక్‌గా అనిపించదు. ఎందుకంటే అక్కడ కనిపించేది తేజా కాదు. సాక్ష్యాత్తూ హనుమానే. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా బాగానే డిజైన్ చేశారు. ‘ఇదెక్కడి మాస్ రా మామా’ అనిపించేలా ఆమెపై ఓ యాక్షన్ సీన్ తెరకెక్కించారు. విలన్ గా వినయ్ రాయ్ స్టైలీష్‌గా ఉన్నాడు. ఆ పాత్రపై మరింత కసరత్తు చేయాల్సింది.
టెక్నికల్ గా ఈ సినిమా ‘వావ్’ అనిపిస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని మరింత ఎలివేట్ చేశాయి. యాక్షన్ ఎపిసోడ్స్ లో వచ్చే బీజియమ్స్ చాలా హై ఇచ్చాయి. గౌరి హరకు కెరీర్‌కు ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. దర్శకుడి ప్రతీ ఆలోచనా తెరపై అర్థవంతంగా అందంగా కనిపించిందంటే కారణం నిర్మాతే. తేజా సజ్జా అనే హీరో పై ఇంత క్వాలిటీగా, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారంటే అదంతా కథపై, దర్శకుడిపై నమ్మకమే. ఆ నమ్మకాన్ని.. ప్రశాంత్ వర్మ నిలబెట్టుకొన్నాడు. మన సూపర్ హీరో కథని.. మన ప్రేక్షకులకు చూపించాలి అనేది ప్రశాంత్ వర్మ ఆలోచన. అందులో సఫలీకృతమయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు మన హనుమాన్ తప్పకుండా నచ్చుతాడు. నార్త్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చేరువైతే.. అది బోనస్. సూపర్ హీరో కథల్ని వరుసగా తీయాలి అనే లక్ష్యంతో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. దానికి… ‘హనుమాన్’ తో మంచి పునాది పడినట్టే.
ఫినిషింగ్ టచ్: జై బోలో ‘హనుమాన్’కీ!
తెలుగు360 రేటింగ్: 3/5
-అన్వర్