ఈ సంక్రాంతి పండక్కి విడుదల అవుతున్న చిత్రాల్లో ‘హను – మాన్’ ఒకటి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నిజానికి హనుమాన్కీ చిరుకీ ముందే ఓ లింక్ ఉంది. అదేంటంటే.. ఈ సినిమా టైటిల్ ఐడియా చిరంజీవిదే. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని `మీకిష్టమైన సూపర్ హీరో ఎవరు స్పైడర్ మానా, ఐరన్ మానా, బ్యాట్ మేనా, సూపర్ మానా` అని అడిగితే… మన హనుమంతుడు ఉండగా మరో సూపర్ హీరో పేరు చెప్పడం ఏమిటని భావించిన చిరు ‘హను -మాన్’ అన్నారు. దాంతో.. హనుమంతుడు కాస్తా.. ‘హను-మాన్’ అయిపోయాడు. ఈ విషయాన్ని ‘హనుమాన్’ టీమ్ కూడా చెప్పింది. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ పాత ఇంటర్వ్యూని `హనుమాన్` ప్రీ రిలీజ్ వేడుకలో గుర్తు చేశారు. అలా టైటిల్ క్రిడిట్ కూడా చిరంజీవి తీసుకొన్నారు. చిరంజీవికి హనుమంతుడు ఇలవేల్పు. హనుమాన్ తన జీవితాన్ని మార్చిన విధానం, తన జీవితంలో మమేకమైన పద్ధతినీ.. చిరు ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.