హైదరాబాద్: హనుమంతుడు అంటే భూత, ప్రేతాలవంటి దుష్టశక్తులకు భయమని, ఆయన బొమ్మ మెళ్ళోగానీ, జేబులోగానీ ఉంటే అవేవీ దగ్గరకు రావని హిందువులకు ఒక బలమైన నమ్మకం అన్న సంగతి తెలిసిందే. ఈ నమ్మకం అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా ఉందట. తన జేబులో ఎప్పుడూ హనుమంతుడు బొమ్మ ఉంటుందని ఒబామా తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశాధ్యక్షునిగా పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా యూట్యూబ్ వ్యవస్థాపకురాలు ఇన్గ్రిడ్ నీల్సన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అలసటగా, నిరుత్సాహంగా అనిపించినపుడు తన జేబులో ఉన్న ఆంజనేయుని బొమ్మ చూసి ప్రేరణ పొందుతానని ఒబామా చెప్పారు. జేబులో ఇంకా ఏమేమి ఉంటాయని నీల్సన్ అడగగా, హనుమంతుని బొమ్మతో పాటు పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన రోజరీ బీడ్స్, ఒక బౌధ్ధ సన్యాసి ఇచ్చిన బుద్ధుడి బొమ్మ, ఇథియోపియా నుంచి తెచ్చుకున్న శిలువ బొమ్మ, వెండి పోకర్ ఆట చిప్ కూడా ఉంటాయంటూ వాటిని తీసి చూపించారు.